కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కోసం ప్రభుత్వం 13,400 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.2 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. 1. 7 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఒక్కో ఓటరు ప్రాధాన్యతా క్రమంలో ముగ్గురికి ఓటు వేయవచ్చు. 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థిని విజయం సాధించినట్టు పరిగణిస్తారు.
శ్రీలంక 2022లో తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని చూసిన తర్వాత ఇవే మొదటి అధ్యక్ష ఎన్నికలు. పోలింగ్ స్టేషన్ లోకి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశించిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ఓటింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 4 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపును ప్రారంభించినట్టు చెప్పారు. ఆ తర్వాత సాధారణ ఓట్లను లెక్కిస్తామని పేర్కొన్నారు.