- పార్లమెంట్ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదు
- నేడు వెలువడనున్న ఫలితాలు
కొలంబో: శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 7కు దేశవ్యాప్తంగా 13,314 కేంద్రాల్లో మొదలైన పోలింగ్.. సాయంత్రం 4 దాకా కొనసాగింది. మొత్తం 1.70 కోట్ల ఓటర్లుండగా 65% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. 90 వేల మంది పోలీసులు, సైనికులు బందోబస్తు నిర్వహించారని తెలిపారు. అన్ని బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుందని, గురువారం అర్ధరాత్రి తర్వాత మొదటి ఫలితం రావచ్చని చెప్పారు.
శుక్రవారంకల్లా పూర్తి ఫలితం తేలనుందన్నారు. కాగా, శ్రీలంక పార్లమెంటులో 225 ఎంపీ సీట్లున్నాయి. ఎంపీల కాలపరిమితి ఐదేండ్లు ఉంటుంది. శ్రీలంక అధ్యక్షుడు అరుణకుమార దిసనాయకే నేతృత్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత దిసనాయకే మీడియాతో మాట్లాడుతూ తాము 150 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.