వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ గా తాను మళ్లీ గెలవకపోతే దేశంలో రక్తపాతం జరుగుతుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నిక అమెరికా చరిత్రలో అతి ముఖ్యమైన రోజని ఆయన పేర్కొన్నారు. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవడం అత్యంత అవసరమని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు జో బైడెన్ విధానాలకు వ్యతిరేకంగా ఒహియోలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు.
తమ దేశ చరిత్రలో నవంబర్ 5వ తారీఖు అతి ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుందని భావిస్తున్నానని చెప్పారు. అధ్యక్షుడు బైడెన్ వరస్ట్ ప్రెసిడెంట్ అని వ్యాఖ్యానించారు. బైడెన్ వాహన పరిశ్రమ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. మెక్సికోలో కార్లు తయారుచేసి అమెరికన్లకు అమ్మాలన్న చైనా ప్లాన్లకు బైడెన్ మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనా పప్పులు ఉడకవని, అమెరికాలో తమ కార్లు విక్రయించాలన్న ప్రయత్నం సఫలం కాదన్నారు. అమెరికాలో కార్లను చైనా విక్రయించాలనుకుంటే 100% దిగుమతి సుంకం విధిస్తానని చెప్పారు. లక్షలాది మంది ఇమ్మిగ్రెంట్లకు బైడెన్ ప్రభుత్వం వర్క్ పర్మిట్లు జారీచేసి అమెరికన్లను బైడెన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
ట్రంప్ ఓ లూసర్డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బైడెన్ ప్రచారవర్గం స్పందించింది. ట్రంప్ ఓ లూసర్ అని విమర్శించింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని గుర్తుచేసింది.