పూర్ టేస్ట్.. సోనియా గాంధీ వ్యాఖ్యలకు రాష్ట్రపతి కార్యాలయం కౌంటర్

పూర్ టేస్ట్.. సోనియా గాంధీ వ్యాఖ్యలకు రాష్ట్రపతి కార్యాలయం కౌంటర్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ నేతలు విరుచుకుపడుతుండగా.. తాజాగా సోనియా గాంధీ కామెంట్స్‎పై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. సోనియా వ్యాఖ్యలకు ధీటుగా అదే రేంజ్‎లో సెటైరికల్‎గా కౌంటర్ ఇచ్చింది రాష్ట్రపతి కార్యాలయం.

‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్లో చేసిన ప్రసంగంపై సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా ఖండించదగినవి. రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీది పూర్ టేస్ట్ (పేలవమైన అభిరుచి)’’ అంటూ కౌంటర్ ఇచ్చింది రాష్ట్రపతి కార్యాలయం. సోనియా కామెంట్స్‎కు ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ రియాక్ట్ కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..?

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‎ను కేంద్ర ప్రభుత్వం 2025, ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం (జనవరి 31) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ స్పందించారు. 

ALSO READ | పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు: రాష్ట్రపతి ముర్ము

పార్లమెంట్ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రసంగం చివరికి రాష్ట్రపతి చాలా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది. అంతగా చదవాల్సింది కాదు. పూర్ థింగ్’ అంటూ ప్రెసిడెంట్ స్పీచ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్దమైన అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ గిరిజనులను అవమానించడం కాంగ్రెస్‎కు అలవాటు అయిపోందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆదివాసీ, గిరిజనులు అంటే కాంగ్రెస్ కు చిన్నచూపని.. సోనియా గాంధీ వ్యాఖ్యలతో ఆ విషయం మరోసారి స్పష్టమైందన్నారు.