దాదాపు 18 రోజులపాటు సాగిన హైడ్రామా అనంతరం మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్ విధించక తప్పలేదు. ఆ రాష్ట్ర చరిత్రలో ఇది మూడోసారి అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి చాలా చిత్రమైంది. గతంలో 1980లోనూ, 2014లోనూ అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ లేకపోవడంతో గవర్నర్ పాలన తప్పనిసరైంది. కానీ, ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏ ఒక్కరికీ మేజిక్ ఫిగర్ రాకపోవడంతో అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో ఉంచాల్సి వచ్చింది. 1960లో ఆ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు జరిగిన ఏ ఎలక్షన్లోనూ హంగ్ ఫలితాలు రాలేదు. అక్కడి ఓటర్లు హంగ్ తీర్పు ఇవ్వడం, ఏ ఒక్క పార్టీ సపోర్ట్ లేఖలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం ఇదే మొదటిసారి.
ఇటీవల జరిగిన ఎలక్షన్లో అధికార బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కి 44 సీట్లు మాత్రమే దక్కాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో బీజేపీ, శివసేన కూటమి మాత్రమే ముందునుంచీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచాయి. శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఫలితాలు వెలువడగానే తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ తమకు అనుకూలమైన పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పింది. శివసేన మొదటినుంచీ పవర్ పాలిటిక్స్ నడిపి, సోమవారం రాత్రి ఆశలు వదులుకుంది.
అసెంబ్లీ రిజల్ట్స్ రాగానే, గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ పార్టీ 2014లో శివసేనతో పోస్ట్–ఎలక్షన్ అలయెన్స్ కుదుర్చుకుని ప్రభుత్వాన్ని నడపగా, ఈసారి ఎన్నికలకు ముందే శివసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. దీంతో సునాయాసంగానే కొయిలేషన్ గవర్నమెంట్ ఏర్పడుతుందని అందరూ అనుకున్నారుగానీ, చివరలో శివసేన ఎదురు తిరిగింది. ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో అధికారాన్ని పంచుకుందామని బీజేపీతో బేరాలాడింది. రెండున్నరేళ్ల తర్వాత తమ పార్టీకి పవర్ అప్పగించాలన్నది శివసేన షరతు. బీజేపీ దీనికి ఒప్పుకోకుండా ఒక డిప్యూటీ సీఎం పదవితో పాటు మొత్తంగా 14 కేబినెట్ పదవులివ్వడానికి రెడీ అయ్యింది. శివసేన ససేమిరా ఒప్పుకోకపోవడంతో పవర్ రేస్ నుంచి బీజేపీ తప్పుకుంది. ఈసారి గవర్నర్ కోషియారీ రెండో పెద్ద పార్టీ అయిన శివసేనను పిలిచారు. ఎన్సీపీ–కాంగ్రెస్‌లతో మంతనాలు జరిపినా, వాళ్లు ఎలాంటి ఆసక్తి చూపకపోవడంతో సోమవారం రాత్రి చేతులెత్తేసింది. తమకు 48 గంటల గడువు కావాలని కోరితే, గవర్నర్ నిరాకరించి, మూడో పెద్ద పార్టీ ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. మంగళవారం రాత్రిలోగా తమకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల నుంచి లెటర్లు అందజేయాలని గవర్నర్ గడువు పెట్టారు. ఎన్సీపీకూడా గడువు పెంచమనేసరికి, గవర్నర్ చేసేదేమీ లేక ప్రెసిడెంట్ రూల్కి సిఫారసు చేస్తూ కేంద్రానికి రిపోర్టు చేశారు. దీనిపై కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
హంగ్ అసెంబ్లీలో 10సార్లు ప్రెసిడెంట్ రూల్
1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో 130 సార్లు ప్రెసిడెంట్ రూల్ విధించారు. అయితే, ఎన్నికలు ముగిశాక హంగ్ అసెంబ్లీ కారణంతో, ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విధించిన సందర్భాలు కేవలం 10 మాత్రమే. బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో రెండేసిసార్లు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఫస్ట్ టైమ్ హంగ్ అసెంబ్లీ కేరళలో ఏర్పడింది. 1965 ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 67 సీట్లు ఏ పార్టీకి రాకపోవడంతో రెండేళ్లపాటు ప్రెసిడెంట్ రూల్ నడిపించి, మధ్యంతర ఎన్నికలు జరపాల్సి వచ్చింది.
అసెంబ్లీలోనే బలనిరూపణ
గతంలో చీటికిమాటికీ రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు చాలా ఉండేవి. 1994లో సుప్రీం కోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్‌తో శాసనసభలో బలనిరూపణనేది తప్పనిసరగా పాటిస్తున్నారు. 1989లో తనను దింపేసి, అసెంబ్లీని రద్దు చేయడాన్ని అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మయ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అసెంబ్లీలోనే బలాబలాలు తేలాలి తప్ప, గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం స్పష్టం చేసింది. ఆ తర్వాత నుంచి ఇదే ప్రాతిపదికగా, అధికార పార్టీ మైనారిటీలో పడినప్పటికీ గవర్నర్లు తొందరపడడం లేదు. అసెంబ్లీలో మిగిలిన పెద్ద పార్టీలకు అవకాశమిస్తూ వస్తున్నారు. సర్కార్ ఏర్పాటుకు అన్ని దారులు మూసుకుపోతేనే ప్రెసిడెంట్ రూల్‌కు సిఫారసు చేస్తున్నారు.
బీహార్‌లో రెండుసార్లూ హంగే
మహారాష్ట్ర భవిష్యత్తు ఏమిటన్నది ప్రస్తుతం పొలిటికల్ ఎక్స్పర్ట్లందరినీ ఆలోచనలో పడేసింది. ఇంతకుముందు ఎన్నికలు పూర్తయినా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏదో ఒక కూటమి ముందుకు వచ్చేది. ఒకే ఒక్కసారి బీహార్‌లో చాలా ఇబ్బంది ఏర్పడింది. 2005లో ఒకే ఏడాది రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిపితే, రెండుసార్లూ హంగ్ ఫలితాలే వచ్చాయి. బీహార్ అసెంబ్లీలోని 243 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పరచాలంటే 122 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఫిబ్రవరిలో రబ్డీ దేవి (ఆర్జేడీ) నాయకత్వంలో ఎలక్షన్ జరగ్గా, అధికార రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కి 75 సీట్లే వచ్చాయి. ప్రతిపక్షాలైన జనతాదళ్ (యూ)కి 55, బీజేపీకి 37, కాంగ్రెస్‌కి 10 సీట్లు వచ్చాయి. దీంతో ప్రెసిడెంట్ రూల్ విధించి, మరలా అదే ఏడాది అక్టోబరులో రెండోసారి ఎలక్షన్ జరిపించారు. ఈసారికూడా హంగ్ రిజల్ట్సే వచ్చాయి. జనతాదళ్(యూ)కి 88 సీట్లు రాగా, బీజేపీకి 55, ఆర్జేడీకి 54, పాశ్వాన్‌కి చెందిన ఎల్జీపీకి 10, కాంగ్రెస్‌కి 9 స్థానాలు దక్కాయి. దీంతో బీజేపీ, ఎల్జీపీల సపోర్ట్‌తో జేడీ(యూ) తరఫున నితీశ్‌కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బీహార్ తరహాలోనే తాజా ఎన్నికలకు వెళ్తారా; లేక కొంతకాలం వేచిచూసి, శివసేన మనసు మార్చుకుంటుందా అని ఎక్స్‌పర్ట్‌లు చర్చలు జరుపుతున్నారు.
అన్ని అధికారాలు గవర్నర్‌వే..
ఆర్టికల్–356 కింద ప్రెసిడెంట్ రూల్ విధించిన రాష్ట్రాల్లో గవర్నర్‌కే అన్ని అధికారాలు ఉంటాయి. ఆయన నేరుగా రాష్ట్రపతికే జవాబుదారీ అవుతారు. తనకు సహకరించడానికి రిటైరైన ఐఏఎస్ అధికారులనుగానీ, లేదా ఇతర ఉన్నతాధికారులనుగానీ నియమించుకోవచ్చు. ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధ్యం, అసెంబ్లీ, కేబినెట్ వంటివేవీ ఉండవు. అడ్మినిస్ట్రేషన్, పోలీసు వంటి కీలక విభాగాలన్నీ గవర్నర్ అజమాయిషీలోనే పనిచేస్తాయి. ఈ పాలన తక్కువలో తక్కువగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. గతంలో ఏడు రోజులు మాత్రమే ప్రెసిడెంట్ రూల్ సాగిన సందర్భాలున్నాయి. మాగ్జిమమ్ మూడేళ్లకు మించి ఉండడానికి వీల్లేదు. ప్రతి ఆరు నెలలకొకసారి పార్లమెంట్ ఆమోదంపై పొడిగించాల్సి ఉంటుంది. పంజాబ్‌లో 1987–92 మధ్య నాలుగేళ్ల 259 రోజులు, జమ్మూ కాశ్మీర్లో 1990–96 మధ్య ఆరేళ్ల 264 రోజులు ప్రెసిడెంట్ రూల్ కొనసాగించారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ మిలిటెన్సీ కారణంగా పొడిగించాల్సి వచ్చింది.
10సార్లు ఇట్లా
దేశంలో అనేక రాష్ట్రాలు రాష్ట్రపతి పాలనను చవిచూశాయి. మొత్తం 130 సార్లు ‘రాష్ట్రపతి పాలన’ అనే మాట వినిపించింది. అయితే, ఎన్నికల తరువాత ఆయా రాష్ట్రాల్లో హంగ్ (ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్థితి) కారణంగా అనేక రాష్ట్రాల్లో గతంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇలాంటి పరిస్థితులు రావడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం పది సార్లు ప్రెసిడెంట్స్ రూల్ విధించారు. బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో అయితే ఇప్పటివరకు రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
బీహార్: ఇక్కడ 1995 మార్చి 28 నుంచి ఏప్రిల్ 5 వరకు (మొత్తం 8 రోజులు) రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటికి అసెంబ్లీ కాలపరిమితి ముగిసింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ టైంలో ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు సంబంధించిన ‘ఓట్ ఆన్ అకౌంట్’ కోసం రాష్ట్రపతి పాలన విధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బీహార్ లో రెండోసారి 2005లో ప్రెసిడెంట్స్ రూల్ విధించారు. 2005 మార్చి 7 నుంచి అదే ఏడాది నవంబర్ 24 వరకు ( మొత్తం 262 రోజులు ) రాష్ట్రపతి పాలన నడిచింది.
ఉత్తరప్రదేశ్ : ఈ రాష్ట్రంలో లో మొత్తం రెండుసార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు. మొదటి సారి 1995 లో ప్రెసిడెంట్స్ రూల్ విధించారు. 1995 అక్టోబర్ 18 నుంచి 1997 మార్చి 21వరకు (మొత్తం ఏడాది, 154 రోజులు ) ఇక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. రెండోసారి 56 రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. 2002 మార్చి 8 నుంచి మే 3 వరకు ఉత్తరప్రదేశ్‌లో ప్రెసిడెంట్స్ రూల్ అమల్లో ఉంది.
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటివరకు రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 2002 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 2 వరకు ( మొత్తం 15 రోజులు ) ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్ అమల్లో ఉంది. 2015లో మరోసారి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలన లోకి వెళ్లింది. 2015 జనవరి 9 నుంచి మార్చి 1 వరకు (మొత్తం 51 రోజులు ) ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.
గుజరాత్: విశ్వాస పరీక్షకు సంబంధించి వివాదం తలెత్తడంతో అక్కడి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి 1996 లో గుజరాత్ లో రాష్ట్రపతి పాలన విధించారు. 1996 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబరు 23 వరకు (34 రోజులు ) గుజరాత్ లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.
కేరళ: దక్షిణాది రాష్ట్రమైన కేరళలో 1964 నుంచి 1967 వరకు సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. 1964 సెప్టెంబర్ 10 నుంచి 1967 మార్చి 6 వరకు (మొత్తం రెండేళ్ల 177 రోజులు ) ఇక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగింది.
మణిపూర్ : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో 1967లో ప్రెసిడెంట్స్ రూల్ విధించారు. 1967 జనవరి 12 నుంచి మార్చి 19 వరకు ( మొత్తం 66 రోజులు ) ఇక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.
రాజస్థాన్ : 1967లో గుజరాత్ లో రాష్ట్రపతి పాలన విధించారు. 1967 మార్చి 13 నుంచి ఏప్రిల్ 26 వరకు (మొత్తం 44 రోజులు ) ఇక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.