ప్రింట్‌‌, ఎలక్ట్రానిక్‌‌ మీడియాకు బాధ్యత ఉంటుంది : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి 

ప్రింట్‌‌, ఎలక్ట్రానిక్‌‌ మీడియాకు బాధ్యత ఉంటుంది : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి 
  • సోషల్‌‌ మీడియాపై నియంత్రణ లేదు
  • ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి 

వేములవాడ, వెలుగు: ప్రింట్‌‌, ఎలక్ట్రానిక్‌‌ మీడియాపై సామాజిక బాధ్యత ఉంటుందని , కానీ సోషల్​ మీడియాకు ఎలాంటి బాధ్యత, నియంత్రణ లేవని ప్రెస్​ అకాడమీ చైర్మన్  శ్రీనివాస్‌‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్  కొత్త బిల్డింగ్‌‌(ఐజేయూ)ను విప్ ఆది శ్రీనివాస్‌‌, ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్‌‌లు ప్రజల సమస్యలు వినే కేంద్రాలుగా మారాలన్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయిందని,  సోషల్‌‌ మీడియాతో ఆ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. అదే టైంలో అవాస్తవాలు ప్రచారం కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మీద ప్రెస్‌‌ కౌన్సిల్, అంబుడ్స్​మెన్  వ్యవస్థలు ఉన్నాయన్నారు. వీటి పరిధిలో బాధ్యతగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రెస్‌‌క్లబ్‌‌ సభ్యులు, మీడియా ప్రతినిధులు సమాజంలో జరిగే వాస్తవాలను ప్రజలకు చేరవేయాలన్నారు.

విప్​ఆది శ్రీనివాస్  మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో నైతిక విలువలు కాపాడేలా పని చేయాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలవడంలో మీడియా ప్రతినిధుల పాత్ర ఉందని, దానిని తానెప్పుడూ మరిచిపోనన్నారు. అంతకుముందు వారంతా కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రెస్​క్లబ్​అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్‌‌, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు సంతోష్​, ప్రెస్‌‌ క్లబ్  జనరల్​ సెక్రటరీ మహేశ్‌‌, ఉపాధ్యక్షుడు ప్రశాంత్​ పాల్గొన్నారు.