కేసీఆర్, కేటీఆర్‌‌‌‌తోనే నల్గొండ అభివృద్ధి : గుత్తా సుఖేందర్​ రెడ్డి

నల్గొండ, వెలుగు :  సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్ వల్లే నల్గొండ అభివృద్ధి చెందిందని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి చెప్పారు.  ఆదివారం నల్గొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్​ నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకున్నారని, ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. సోమవారం మంత్రి కేటీఆర్​పర్యటన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఎలాంటి ప్రకటన చేయడం లేదని, మిషన్ కాకతీయ, భగీరథ పథకం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎంతసేపు తెలంగాణ మీద అక్కసు వెళ్లగక్కడం తప్ప ఇచ్చేదేమీ లేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయడంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌కు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

విసిరేసిన రాళ్లతో ఇల్లు కట్టుకుంటానని గవర్నర్​ వ్యాఖ్యలు చేయడం బాధకరమని, తెలంగాణలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవన్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్‌‌, ఆ పార్టీ లీడర్లు మతిభ్రమించి మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు