రైతు వేదికలు, ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం
శ్మశానవాటికలు, డంపుయార్డులు, విలేజ్పార్కులకూ అదే టార్గెట్
ఉరుకులు, పరుగులు పెడుతున్న అధికారులు
సర్పంచులు, కార్యదర్శులను సస్పెండ్ చేస్తున్నా కనిపించని ప్రోగ్రెస్
వెలుగు, నెట్వర్క్: ‘దసరా దాటితే కార్తీక పున్నం దాకా మంచి ముహూర్తాలు లేవు.. ఆలోగా రైతువేదికలు, శ్మశానవాటికలు, డంప్‌యార్డులు, విలేజ్పార్కులు అన్నీ కంప్లీట్‌చేసి, దసరా రోజు ప్రారంభించాలె.. ప్రాపర్టీ సర్వే కూడా పూర్తిచేసి ధరణి పోర్టల్ అందుబాటులోకి తేవాలె..’ అన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జిల్లాల్లో కలెక్టర్లు సహా ఆఫీసర్లంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కొద్దినెలలుగా కరోనాను సైతం లెక్కచేయకుండా అధికారులు స్వయంగా ఊళ్లు పట్టుకొని తిరుగుతున్నా చాలా జిల్లాల్లో ఆయా నిర్మాణాలు కంప్లీట్చేయలేకపోయారు. ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్‌తో రైతు వేదికల నిర్మాణం లేట్ అవుతోంది. ఇక ఎలాంటి ప్లానింగ్ లేకుండా హడావిడిగా ప్రారంభించిన ప్రాపర్టీ సర్వే కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. కానీ దసరాకల్లా కంప్లీట్కావాల్సిందేనని సర్కారు నుంచి వస్తున్న ప్రెషర్‌తో ఆఫీసర్లు సర్పంచులు, కార్యదర్శులకు మొదట షోకాజ్ నోటీసులు ఇచ్చి, సస్పెండ్ చేస్తున్నారు.
డెడ్‌లైన్ పొడిగిస్తున్నా..
పల్లె ప్రగతిలో భాగంగా ఊరూరా శ్మశానవాటిక, డంపుయార్డు, విలేజ్‌పార్కు, ప్రతి క్లస్టర్ పరిధిలో ఒక రైతువేదిక నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో శ్మశానవాటికకు రూ.12 లక్షలు, డంపింగ్ యార్డు కు రూ.2.50 లక్షలు, విలేజ్పార్కుకు రూ. 5.7 లక్షలు, రైతువేదికకు రూ.22 లక్షల చొప్పున మంజూరు చేసింది. పంచాయతీరాజ్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా, సర్పంచులు, కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈజీఎస్ ఫండ్స్‌నే ప్రధానంగా వాడుకుంటుండడంతో నిధులకు సమస్య లేదు. దీంతో జూన్‌లోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఫీల్డ్లెవల్లో ల్యాండ్ ఇష్యూస్ కారణంగా చాలా జిల్లాల్లో వీటి నిర్మాణం లేటవుతోంది. డంపుయార్డులు, శ్మశానవాటికలు, విలేజ్పార్కుల పరిస్థితి కాస్త బెటర్‌గా ఉన్నా రైతువేదికల్లో ప్రోగ్రెస్లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాలకొక క్లస్టర్ చొప్పున 2,604 క్లస్టర్ల పరిధిలో రూ.573 కోట్లతో నిర్మిస్తున్న రైతువేదికలు కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట లాంటి కొన్ని జిల్లాల్లో తప్ప ఎక్కడా కనీసం10 శాతం కూడా కంప్లీట్ కాలేదు. ఇక ప్రభుత్వ ఆదేశాలతో గత నెల 28న హడావిడిగా ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల సర్వేను ఈ నెల 15కల్లా పూర్తిచేయాలని టార్గెట్పెట్టుకున్నా ఇప్పటికి 50 శాతం కూడా కాలేదు. మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బందితో పాటు ప్రైవేట్స్టాఫ్ను రంగంలోకి దించినప్పటికీ అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదు. పట్టణ ప్రాంతాల్లో కాస్త స్పీడ్ గానే నడుస్తున్న ప్రాపర్టీ సర్వే, పల్లెల్లో సిగ్నల్స్అందక అలస్యమవుతోంది. రూరల్ ఏరియాలో సర్వర్ ప్రాబ్లమ్‌తో స్మార్ట్ఫోన్లు మొరాయిస్తున్నాయి. ఒక్కో కార్యదర్శికి రోజూ 50 నుంచి 60 ఇళ్లు టార్గెట్ పెట్టగా, సర్వర్ డౌన్‌కారణంగా 20 నుంచి 30 ఇళ్లకు మించి సర్వే చేయలేకపోతున్నామని కార్యదర్శులు చెబుతున్నారు. కానీ దసరా కల్లా ధరణి పోర్టల్ ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడితో ఆఫీసర్లు తమను వేధిస్తున్నారని వాపోతున్నారు.
నోటీసులు.. సస్పెన్షన్లు
రైతువేదికలు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశానవాటికల నిర్మాణం లేట్అవుతుండడం, క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా ప్రభుత్వం మరోసారి దసరాకల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించడం ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. దీంతో వివిధ కారణాలతో పనుల్లో జరుగుతున్న ఆలస్యానికి కిందిస్థాయి సిబ్బందిని బాధ్యులను చేస్తూ యాక్షన్ తీసుకుంటున్నారు. చాలా జిల్లాల్లో సర్పంచులమీద, విలేజీ సెక్రటరీల మీద వేటు వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 100 మంది కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు. నాగయ్యపల్లి సర్పంచ్‌ను సస్పెండ్ చేయగా ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పదిమంది సర్పంచులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో అవెన్యూ ఫ్లాంటేషన్, కంపోస్ట్ షెడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఇద్దరు సర్పంచులకు నోటీసులు ఇచ్చారు. ఇద్దరు పంచాయతీ సెక్రెటరీలను సస్సెండ్ చేశారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 14 మంది సర్పంచులు,17 మంది పంచాయతీ సెక్రటరీలు, ఒక ఎంపీడీవోను సస్పెండ్ చేశారు. 183 మంది సర్పంచులు, సెక్రటరీలు, 17 మంది ఎంపీవోలు, ఎండీడీవోలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లాలో పది మంది సర్పంచులకు నోటీసులు ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో 61 మంది సర్పంచులకు, 98 మంది సెక్రటరీలకు షోకాజ్‍నోటీసులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక సర్పంచును సస్పెండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 మంది సర్పంచులకు షోకాజ్ నోటీసులను ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 85 మంది సర్పంచులు, 115 మంది కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. ఇందులో ఏకంగా 56 మంది కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఇంతచేస్తున్నా చాలా జిల్లాల్లో దసరా కల్లా పనులు కంప్లీటయ్యే చాన్స్ లేకపోవడంతో ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారు.
రైతు వేదికల ప్రోగ్రెస్ రిపోర్ట్
జిల్లా మంజూరైనవి పూర్తయినవి
ఆదిలాబాద్ 101 04
నిర్మల్ 76 04
మంచిర్యాల 55 04
ఆసిఫాబాద్ 70 10
కరీంనగర్ 76 07
రాజన్నసిరిసిల్ల 57 03
పెద్దపల్లి 54 01
జగిత్యాల 71 33
నిజామాబాద్ 106 29
కామారెడ్డి 104 74
వరంగల్ రూరల్ 70 13
వరంగల్ అర్బన్ 40 00
మహబూబాబాద్ 82 14
జనగామ 62 01
మహబూబ్ నగర్ 88 00
జోగులాంబ గద్వాల 97 10
నారాయణపేట 74 00
నాగర్‌కర్నూల్ 143 4
వనపర్తి 71 16
మెదక్ 76 01
సంగారెడ్డి 116 10
సిద్దిపేట 126 123
యాదాద్రి 92 01
సూర్యాపేట 82 00
భద్రాద్రి కొత్తగూడెం 67 00
నల్గొండ 136 0
భూపాలపల్లి 45 0
ములుగు 32 0