రేవంత్​ సర్కార్​ కొత్త వ్యూహం.. నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి

రేవంత్​ సర్కార్​ కొత్త వ్యూహం..  నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి
  •  తెలంగాణ సర్కారు సరికొత్త వ్యూహం
  •  మార్చి 8న  ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ 
  • కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఆహ్వానం
  • స్వయంగా ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  •  నిధుల కోసం ఒత్తిడి పెంచడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు కళ్లెం
  • ఇలా మునుపెన్నడూ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టని కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి నిధులు రాబట్టడంతోపాటు ప్రతిపక్షాల విమర్శలకు కళ్లెం వేసేందుకు సర్కారు సరికొత్త  వ్యూహాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా రేపు ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్  నిర్వహిస్తోంది.  ఈ సమావేశానికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని పార్టీల ముఖ్యనేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపైనే ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి మోదీని,  సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ముఖ్యంగా మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, రీజినల్  రింగ్ రోడ్డు అంశాలపై విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. దీంతో  పాటు  పెండింగ్ ప్రాజెక్టులపై  రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీలకతీతంగా పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తేలా వ్యూహరచన చేస్తోంది.