నాగర్ కర్నూల్, వెలుగు: అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎంపీ, ఎమ్మెల్సీలకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో మద్దతుదారులు నారాజ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని, లేదంటే పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే తమ దారి తాము చూసుకుంటామని చెబుతున్నారు. దీంతో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెబుతున్న రాములుపై బీఆర్ఎస్లో ఫ్యూచర్ ఉండదని, పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆదరించి పార్లమెంట్‌కు పంపించిన పార్టీలో కొనసాగాలా లేక క్యాడర్ డిమాండ్ మేరకు పార్టీ మారాలా అనే విషయంపై తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. అలాగే కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై ఆయన వర్గీయులు ఒత్తిడి పెంచుతున్నారు.
సొంత పార్టీ నేతలతోనే ఇబ్బంది..
అచ్చంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాములు మంత్రిగా పని చేశారు. బీఆర్ఎస్లో చేరి 2019లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గెలిచారు. రాములు కొడుకు పోతుగంటి భరత్ కల్వకుర్తి జడ్పీటీసీగా గెలిచారు. జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కు రిజర్వ్ కాగా, భరత్ ప్రయత్నించారు. తెల్కపల్లి జడ్పీటీసీ పద్మావతికి చైర్పర్సన్ అయ్యే అవకాశం దక్కింది. ఆమెపై అనర్హత వేటు పడిన తరువాత, భరత్‌కు అవకాశం ఇవ్వాలని ఎంపీ రాములు నేరుగా సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. ఆయన ఓకే చెప్పినా జిల్లా ఎమ్మెల్యేలు భరత్ జడ్పీ చైర్మన్ కాకుండా అడ్డుకున్నారు. అప్పుడే పార్టీకి రాజీనామా చేయాలని మద్దతుదారులు పట్టుబట్టినా సైలెంట్‌గా ఉన్నారు. నిరాశకు గురైన భరత్ జడ్పీటీసీ పదవికి రిజైన్ చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన రాజీనామాను కలెక్టర్ ఆమోదించలేదు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. మంత్రి నిరంజన్ రెడ్డి, గద్వాల, అలంపూర్, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, హర్షవర్దన్ రెడ్డిలతో ఎంపీకి మంచి సంబంధాలున్నాయి. అయితే రాములు సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మాత్రం సఖ్యత లేదు. ఫ్లెక్సీలు, అధికారిక ప్రోగ్రామ్స్, పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ రాములుకు సమాచారం, ఆహ్వానం ఉండడం లేదు. ఇటీవల జరిగిన పోడు భుముల పంపిణీలో కలెక్టర్, గువ్వల పాల్గొన్న కార్యక్రమానికి ఎంపీకి సమాచారం ఇవ్వలేదని తెలిసింది. అలాగే నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తిలో జరుగుతున్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ సమాచారం ఎంపీకి వెళ్లడం లేదు. ఇలాంటి కారణాలతోనే ఎమెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించారు. ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఇలాంటి అవమానాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే కారణంతో అసెంబ్లీకి వెళ్తామని చెబుతున్నారు.