
హుస్నాబాద్, వెలుగు: పేదల భూములను గుంజుకుంటున్న దొరలను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రజలను కోరారు. ‘పల్లె పల్లెకు ప్రవీణన్న, గడప గడపకు కాంగ్రెస్’లో భాగంగా ఆదివారం అక్కన్నపేట మండలం అంతక్కపేటలో ఇంటింటికి తిరిగి బీఆర్‌ఎస్ మోసాలను వివరించారు. ధరణి పోర్టల్‌తో పేదల భూములను గుంజుకున్నారని మళ్లీ అధికారంలోకి ప్రజల బతుకులను ఆగంజేస్తారని విమ్శించారు. కాంగ్రెస్ రూపకల్పన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు ఎత్తును కమీషన్ల కోసం పెంచారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు గడిచిపోయినా నిర్మాణాన్ని పూర్తి చేయడంలేదని, నిర్వాసితులకు కూడా పరిహారం ఇవ్వడం లేదని మండిపడ్డారు.
స్థానికేతరుడైన ఇక్కడి ఎమ్మెల్యేకు భూకబ్జాలు తప్ప నియోజకవర్గ ప్రజల బాధలు పట్టవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీ, పట్టాదారులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ. 15 వేలు, భూమిలేని కూలీలకు రూ. 12వేల సాయం చేస్తామని చెప్పారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల అధ్యక్షులు బంక చందు, జంగపల్లి ఐలయ్య, మంద ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.