![సమ్మర్ యాక్షన్ ప్లాన్](https://static.v6velugu.com/uploads/2025/02/preventive-measures-to-prevent-drinking-water-problems-in-mahabubnagar-nagarkurnool-and-narayanpet-districts_HMwTigj4Gv.jpg)
- తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు
- నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో కొత్త బోర్లు
- అప్పర్ ప్లాట్ గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లు
- వారం రోజులుగా ఫీల్డ్ సర్వే చేస్తున్న అధికారులు
మహబూబ్‌నగర్, వెలుగు:వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. వారం రోజుల నుంచి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మండల ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శించి తాగునీటి సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
లీజుకు వ్యవసాయ బోర్లు..
మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో 80 శాతం గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. పలు మున్సిపాల్టీలతో పాటు గ్రామ పంచాయతీల్లో పైపులైన్లు, ఇంట్రా పైపులైన్ పనులు పూర్తి కాకపోవడంతో అక్కడ బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. వేసవి ప్రారంభం అవుతుండడంతో గ్రామాలు, మున్సిపల్ వార్డులు, డివిజన్లలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఈ నెల ఒకటి నుంచి పదో తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని మంత్రి సీతక్క డీపీవోలు, మిషన్ భగీరథ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో పంచాయతీ, మిషన్ భగీరథ సిబ్బంది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. పైపులైన్ లీకేజీలు గుర్తించి రిపేర్లు చేయిస్తున్నారు. అలాగే అప్పర్ ప్లాట్స్(ఎత్తైన ప్రాంతాలు), డ్రై ఏరియాల్లో ఏటా ఇబ్బందులు వస్తుండడంతో ఆ ప్రాంతాల్లో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని నిర్ణయించారు. సమీపంలోని వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకునేందుకు రైతులతో చర్చలు జరుపుతున్నారు.
రిపేర్లకు ఎస్డీఎఫ్ ఫండ్స్..
నెల రోజులుగా మిషన్ భగీరథ ఆఫీసర్లు పాత బోర్లను పరిశీలిస్తున్నారు. పూడిపోయిన వాటిని రీ డ్రిల్ చేయిస్తున్నారు. పంచాయతీ బోర్లను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బోరు మోటార్లు పని చేస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. పని చేయకుంటే రిపేర్లు చేయిస్తున్నారు.
రిపేర్లకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్(ఎస్డీఎఫ్)ను వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టి రిపేర్లు చేయించి, అనంతరం బిల్లులు తీసుకుంటున్నారు. అవసరం ఉన్న చోట్ల ఎమ్మెల్యేలు, కలెక్టర్ల పర్మిషన్లు తీసుకొని కొత్త బోర్లను డ్రిల్ చేయిస్తున్నారు. అయితే చాలా చోట్ల నీళ్లు పడకపోవడంతో ట్యాంకర్లను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు.
నారాయణపూర్ నుంచి నీటి విడుదలకు వినతి..
ఎండలు ముదురుతుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్పీడ్‌గా అడుగంటుతోంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, వనపర్తి, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 30 లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి ఐదు టీఎంసీల నీటిని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు విడుదల చేయాలని కోరారు. స్పందించిన ఆయన నాలుగు టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించారు.
హ్యాండ్ పంపులు, మోటార్లను వినియోగంలోకి తెస్తున్నాం..
మిషన్ భగీరథ ద్వారా ప్రస్తుతం తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఐదు నుంచి పది ఇండ్లు ఉన్న ప్రాంతాలను కూడా ఒక హ్యాబిటేషన్గా గుర్తించి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్త బోర్లు వేయిస్తున్నా, చాలా చోట్ల ఫెయిల్ అవుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతున్నాం. గ్రామాల్లో హ్యాండ్ పంపులు, సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ మోటార్లు, ఓపెన్ వెల్స్‌ను వినియోగంలోకి తెస్తున్నాం. –హెచ్.జగన్మోహన్, ఎస్ఈ, మిషన్ భగీరథ