రైతు ఆత్మహత్యలపై లెక్కల్లేవ్

రైతు ఆత్మహత్యలపై లెక్కల్లేవ్
  • దాచిపెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 
  • 2018 నుంచి ఐదేండ్లు నమోదు చేయలేదు 
  • రైతు బీమా కింద అదర్స్ కేటగిరీలో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను దాచిపెట్టింది. 2018 నుంచి ఐదేండ్ల పాటు రైతు ఆత్మహత్యలను అధికారికంగా నమోదు చేయలేదు. ఏ రైతు ఏ కారణంతో సూసైడ్​ చేసుకున్నారనే దానిపై గతంలో ఒక ప్రొసీజర్​ప్రకారం నమోదు చేసేవారు. అయితే గత ప్రభుత్వం రైతుబీమా పథకం తీసుకొచ్చిన తర్వాత ఆ లెక్కలను పూర్తిగా ఆపేసింది. రైతులు చనిపోతే రూ.5 లక్షల బీమా ఇచ్చేందుకు ఈ పథకం తీసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన గత ప్రభుత్వం.. రైతు ఆత్మహత్యలను రైతుబీమాలో అదర్స్ కేటగిరీలో ఎంట్రీ చేస్తూ వచ్చింది. 

ఇక రైతు బీమా పరిధిలోకి రాని రైతుల ఆత్మహత్య లెక్కలు అసలే లేవు. రైతుబీమా కారణంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్​బ్యూరో నివేదికల్లోనూ ఫార్మర్స్​సూసైడ్స్ లెక్కలు సరిగా లేవని ఆఫీసర్లు అంటున్నారు. ఇటీవల రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్​రివ్యూ చేసినప్పుడు రైతు ఆత్మహత్యల విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అప్పుడే గత బీఆర్ఎస్ సర్కార్ రైతు ఆత్మహత్యలను నమోదు చేయలేదని గుర్తించారు. దీంతో రైతు ఆత్మహత్యల నమోదుకు ఎలాంటి విధానం అనుసరించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.  

ఎన్సీఆర్బీ లెక్కల్లోనూ తక్కువే.. 

గత ఐదేండ్లలో వివిధ కారణాలతో 1.22 లక్షల మందికి పైగా రైతులు చనియినట్టు రైతుబీమా లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అదర్స్ కేటగిరీ కింద 20 వేలకు పైగా రైతు మరణాలను నమోదు చేశారు. ఇందులో ఎక్కువగా రైతు ఆత్మహత్యలే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక నేషనల్​క్రైమ్ రికార్డ్స్​బ్యూరో లెక్కల ప్రకారం 2018 నుంచి 2022 వరకు 2,305 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2022లో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. అంతకుముందు ఏడాది మూడో స్థానంలో ఉంది. ఇక 2023కు సంబంధించిన లెక్కలను ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇంకా విడుదల చేయలేదు. కాగా, వివిధ రైతు సంఘాలు క్షేత్రస్థాయిలో రైతు ఆత్మహత్యలను నమోదు చేస్తున్నాయి. రైతు సంఘాల లెక్కలకు ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ లెక్కలకు పొంతన ఉండడం లేదు. 

కావాలనే దాచారా? 

రైతుబంధు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కష్టాలే లేవని అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్నారు. అయితే అదే టైమ్ లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంతో రాజకీయంగా దుమారం రేగింది. దీంతో గత ప్రభుత్వం రైతుబీమాను అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇచ్చే పరిహారాన్ని నిలిపివేసింది. రైతు ఆత్మహత్యలను నమోదు చేయడం కూడా ఆపేసింది. జిల్లా కలెక్టర్ల ఆధర్వర్యంలో రైతు ఆత్మహత్యల నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలను సైతం ఎత్తివేసింది.