- స్టూడెంట్స్‌కు దీపావళి కానుకగా మేం 40 శాతం పెంచాం: భట్టి
- అలాంటి మాపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నరని ఫైర్
- సంక్రాంతి తర్వాత రేషన్‌కార్డుపై సన్నబియ్యం ఇస్తం: మంత్రి ఉత్తమ్
- సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో యంగ్ ఇండియా స్కూల్ భవన నిర్మాణానికి భూమిపూజ
నల్గొండ, వెలుగు: పదేండ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. సంక్షేమ హాస్టల్స్‌లో చదువుకుంటున్న విద్యార్థుల డైట్, కాస్మోటిక్స్ చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ, తమ సర్కారు దీపావళి కానుకగా డైట్, కాస్మోటిక్ చార్జీలను 40 శాతం పెంచిందని, అలాంటి తమపై ఇప్పుడు బీఆర్ఎస్నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని గడ్డిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన బడుగు బలహీన వర్గాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. 2007 తర్వాత డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదని అన్నారు. తమ ప్రభుత్వం దీపావళి కానుకగా 7.50 లక్షల మంది విద్యార్థులకు 40 శాతం డైట్, కాస్మోటిక్స్ చార్జీలు పెంచిందన్నారు. నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకునేలా దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. వీటి కోసం రూ.5 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి మండలి ఆలోచించి ఇంటర్నేషనల్ స్కూల్స్ డిజైన్లు ఇచ్చే ప్రపంచస్థాయి ఆర్కిటెక్ట్ కు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభించేలా ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.
ఎస్ఎల్బీసీపై ప్రతినెలా సమీక్ష
ఎస్ఎల్బీసి సొరంగం ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేయిస్తామని, నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ పాలకులు పదేండ్ల కాలంలో ఒక్క కిలో మీటర్ సొరంగం తవ్వకం కూడా పూర్తి చేయలేదని అన్నారు. మొత్తం 42 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 32 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే తవ్వితే.. మిగిలిన 10 కిలోమీటర్లలో ఒక్క కిలోమీటర్ కూడా పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పాలకులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ దగ్గర సమీక్ష సమావేశం పెట్టి.. ప్రతి నెలా ఎంత పని జరిగితే అంత మొత్తానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పామని, 20 నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.
అత్యున్నత ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్: మంత్రి వెంకట్‌రెడ్డి
ఊటీలాంటి ఆహ్లాదకర వాతావరణం ఉన్న గడ్డిపల్లి గ్రామంలో అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నదని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు. ఒకే చోట వెయ్యి మంది విద్యార్థులు తినేలాగా డైనింగ్ హాల్ నిర్మిస్తామని చెప్పారు. త్వరలోనే స్కూల్ కు డబుల్ రోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పీ రాంబాబు, డీఆర్డీఏ పీడీ వీవీ అప్పారావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రేషన్ కార్డ్ పై సన్నబియ్యం ఇస్తం: ఉత్తమ్
సంక్రాంతి తర్వాత తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ సారి 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని చెప్పారు. సన్న వడ్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. భారత దేశ చరిత్రలో లక్ష మెజారిటీ సాధించిన ఏకైక నియోజకవర్గం హుజూర్నగర్ అని, ఇక్కడ ఉన్న వారు కాంగ్రెస్ సభ్యులు కారని, వీరంతా తన కుటుంబ సభ్యులని అన్నారు.