- సొంత బిల్డింగులు లేక అవస్థలు
- ఏటా రూ.కోట్లలో చెల్లిస్తున్న అద్దె
- బకాయిలు రాక తాళాలెస్తున్న ఓనర్లు
వనపర్తి, వెలుగు: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు గత ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. అయితే పూర్తిస్థాయి సౌలతులు కల్పించడంలో, సొంత భవనాలను నిర్మించడంలో ఎలాంటి శ్రద్ధ చూపలేదు. దీంతో చాలీచాలని సౌకర్యాలతో స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు లక్షల్లో కిరాయిలు కట్టాల్సి రావడంతో ఆర్థిక భారం పెరుగుతోంది.
టైమ్‌కు కిరాయి కట్టకపోవడంతో ప్రతి నెలా ఓనర్లతో గొడవలు జరుగుతున్నాయి. బకాయిలు పెరిగిపోవడంతో ఇటీవల నాగవరంలోని బాలికల గురుకులం బిల్డింగ్ ఓనరు కాలేజీకి తాళం వేశాడు. స్టూడెంట్లు లోపల.. టీచర్లు బయట ఉండిపోవాల్సి పరిస్థితిలో ఓనర్‌ను సముదాయించి తాళం తీయించారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలు మొత్తం 15 ఉన్నాయి.
ఇందులో కేవలం మూడింటికి మాత్రమే సొంత బిల్డింగులుండగా.. మిగిలిన 12 అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. జిల్లాలో 6 బీసీ గురుకులాలుంటే ఒక్కటే సొంత బిల్డింగులో నడుస్తోంది. నాలుగు మైనారిటీ గురుకులాలకు రెండు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ఎస్సీ గురుకుల పాఠశాల, కాలేజీలు అయిదు అద్దె బిల్డింగులలోనే కొనసాగుతున్నాయి.
నెలకు రూ.లక్షకుపైనే అద్దె
గురుకులాలకు అద్దెకు తీసుకున్న భవనాలకు డిమాండ్, కొలతలను బట్టి ఎస్ఎఫ్టీ లెక్కన అద్దె నిర్ణయించారు. వనపర్తి మండలం నాగవరంలోని సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్‌కు అత్యధికంగా నెలకు రూ.1.50లక్షలు అద్దె చెల్లిస్తుండగా.. వనపర్తిలోని బీసీ గురుకులానికి రూ.40వేలు అద్దె చెల్లిస్తున్నారు. జిల్లాల్లోని గురుకులాల భవనాలకు ఏటా రూ.2.50కోట్ల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది.
ఏ నెలకు ఆ నెల అద్దె చెల్లించకపోవడంవల్ల ఓనర్లతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ బకాయి కాబట్టి ఎప్పటికైనా డబ్బు వస్తుందని కొందరు యజమానులు ఓపిక పడుతుంటే.. మరికొందరు మాత్రం నెలనెలా కిరాయి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రతి బిల్డింగ్‌కు నాలుగైదు నెలల కిరాయి బకాయి ఉంది. నాగవరం భవనానికి 7 నెలలుగా అద్దె కట్టకుపోవడంతో ఓనర్ గేటుకు తాళం వేయడంతో స్టూడెంట్స్ ఇబ్బందిపడ్డారు.
ఒక్కో గురుకులం ఒక్కో చోట
ఒక మండలానికి మంజూరైన గురుకులాన్ని మరో మండలంలో నడిపిస్తున్నారు. కొత్తకోట మండలకేంద్రంలో వీపనగండ్లకు చెందిన ఎస్సీ బాయ్స్ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ నడు స్తోంది. గతంలో గద్వాల బీసీ గురుకులాన్ని వనపర్తిలో నిర్వహించారు. తరువాత మార్చారు. ఇలా ఒక మండలం గురుకులాన్ని మరో మండలంలో ఏర్పాటు చేయడంతో విద్యార్థులు దూరాభారంతో అవస్థలు పడుతున్నారు. ఆయా మండలాలకు గురుకులాలు మంజూరైనప్పుడు అక్కడ వసతి దొరకక పోవడంతో ఇతర మండలాల్లో ఏర్పాటు చేసి.. వాటిని అలాగే కొనసాగిస్తున్నారు.
వచ్చిన నిధులూ వెనక్కి
గురుకులాలకు సొంత భవనాలను నిర్మించేం దుకు గతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే స్థానికంగా ప్రభుత్వ స్థలాలు దొరక్క నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దాంతో ఆ నిధులు వెనక్కి పోయాయి. వనపర్తిలో మైనారిటీ గురుకులం కోసం అధికారులు స్థలాలను చూశారు. అధికారులు చూసిన ల్యాండ్ డిస్ప్యూట్లో ఉండడంతో నిర్మాణం జరగలేదు. ఇలా వివిధ కారణాలతో భవనాల కోసం రిలీజైన ఫండ్స్ వెనక్కి పోయాయి. వెంటనే సొంత భవనాలు నిర్మించి అద్దెభారాన్ని తగ్గించుకోవడంతోపాటు.., విద్యార్ధులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తేవాలని పేరెంట్స్ కోరుతున్నారు.
ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం
గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చే విషయమై జిల్లా హయ్యర్ అఫీషియల్స్‌కు ప్రతిపాదనలు పంపాం. ఏ నెలకు ఆ నెల అద్దె బకాయిలు చెల్లించాలన్న అంశాన్ని కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం.
- మేఘన, బీసీ గురుకుల సమన్వయకర్త