బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని పాత్రలయినా అవలీలగా పోషించగలరు. గతంలో వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు దానికి 'రాజకీయ పునరేకీకరణ' అని అందమైన నామకరణం చేశారు. కానీ, ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని న్యాయపోరాటం చేస్తున్నారు.
కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిన వేళ 'తెలంగాణ రాజకీయ పునరేకీకరణ' అయినపుడు, ఆ పార్టీ నుంచి వేరే పార్టీలలో చేరితే వారిపై 'ఫిరాయింపుల నిరోధక చట్టం' అమలు చేయాలని డిమాండు చేయడం ఏమిటి? తెలంగాణలో 2014లో అధికారంలోకి వచ్చిన నాటి తెలంగాణ రాష్ట్ర సమితి 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకుంది.
మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్లగా, ఆ తర్వాత 10మంది ఎమ్మెల్యేలు టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరడం, ఆయన ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. టీడీపీలో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్య మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా మిగిలారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.
చివరకు భట్టి విక్రమార్క సహా అయిదుగురే మిగిలారు
రా ష్ట్ర సంక్షేమాభివృద్ధిని కాంక్షిస్తూ, ‘రాజకీయ పునరేకీకరణ’లో భాగంగా అధికార పార్టీలోకి మారారని నాటి టీఆర్ఎస్ నాయకులు సమర్థించుకున్నారు. 2014 నుంచి గత అసెంబ్లీ ఎన్నికల దాకా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 63 మందిని చేర్చుకోవడం కేసీఆర్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ఒక ప్రాంతీయ పార్టీలో ఇంత భారీగా వలసలు జరగడం బహుశా మరో రాష్ట్రంలో చోటు చేసుకోలేదు. సంవత్సరాల తరబడి తామున్న పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరడానికి చిల్లర రాజకీయాలు కారణం కానేకాదని, సంక్షేమాభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకతను గుర్తించిన తెలంగాణవాదులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని కేసీఆర్ మద్దతుదారులు ప్రచారం చేశారు.
అంటే, అప్పటి టీఆర్ఎస్ వెలుపల ఉన్న రాజకీయ పార్టీల నేతలు తెలంగాణ ద్రోహులని ముద్ర వేశారు. వాటన్నింటిని ఎదుర్కోవడానికి ‘రాజకీయ పునరేకీకరణ’ అవసరమయింది అని కేసీఆర్ నాడు చెప్పుకున్నారు. అయితే, 2018లో భారీ సంఖ్యలో 88 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తరఫున గెలిచినా, కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి వలసల్ని ఎందుకు ప్రోత్సహించినట్టు? తమ పార్టీ మినహా మిగతా పార్టీలేవీ తెలంగాణలో బతికి బట్టకూడదని కేసీఆర్ వలసల ప్రక్రియను సాగించారు.
అనైతికత గురించి ఇప్పుడా మాట్లాడేది?
ఒక్క మాటలో చెప్పాలంటే 'మన రాష్ట్రం– మన పార్టీ' అన్నది కేసీఆర్, కేటీఆర్ సిద్ధాంతం. ఏ రాజకీయ పార్టీనీ నిర్మూలించడం సాధ్యం కాదని, నిర్వీర్యం చేసినా మరలా ఆ రాజకీయ శక్తి తిరిగి చిగురించే అవకాశం ఉంటుందని, అవసరమైతే ఆ శక్తి కొత్త రూపం తీసుకోవచ్చునని.. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఎలా మరచిపోయారన్నది ఒక మిస్టరీ. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందువరకు తమకు, బీజేపీకి మధ్యనే పోటీ అని కేసీఆర్ భావించారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా కేసీఆర్ అధికార వృక్షాన్ని నేలమట్టం చేయగలరని ఊహించలేదు. రాజకీయాల్లో పరిణామాలు ఎంత అనూహ్యంగా జరుగుతాయో, పరిస్థితులు ఎట్లా తలకిందులవుతాయో అందుకు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ సజీవ ఉదాహరణ. తెలంగాణలో సాధించిన రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత నిర్విరామంగా కొనసాగాలి అని కొన్ని కథనాలను అప్పట్లో కేసీఆర్ మద్దతుదారులు 'ఫిరాయింపులు' నైతికమైనవిగా ప్రచారం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కాకుండా పదవే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీ అయినా ఫర్వాలేదు పదవి ఉంటే చాలు అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. ‘యూనివర్సిటీల స్థాయిలోనే విద్యార్థులను రాజకీయాల్లో పాల్గొనేలా చేయాలి. అక్కడ సిద్ధాంతాలు అలవరుతాయి. దీంతో ఫిరాయింపులు ఈ స్థాయిలో ఉండవు’ అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఫిరాయింపుల నిరోధక చట్టంలో వెసులుబాటు
ప్రజాతీర్పుకు, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినవారిని అనర్హులను చేయాలంటూ 38 ఏళ్ల కిందట తీసుకొచ్చిన ఫిరాయింపులు నిరోధక చట్టం ఏం చేస్తోంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాలలో పార్టీ మారినవారు నిరాటంకంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవుల్లో కొనసాగుతున్నారు. కొందరు మంత్రులుగా మారుతున్నారు.
ఫిరాయింపులను నిరోధించడానికి చట్టం ఉన్నా అందులోని వెసులుబాటును వినియోగించుకుంటున్న నాయకులు సులభంగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. అసలు పార్టీలో చీలిక లేకపోయినా, లెజిస్లేచర్ పార్టీ చీలికనే అసలు పార్టీ చీలికగా అన్వయిస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్, శివసేనను చీల్చిన ఏక్నాథ్ శిండే ఎన్డీఏ కూటమిలో చేరి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు చేపట్టారు.
ఫిరాయింపులపై చర్యలకు కాలపరిమితి లేదు
ఫిరాయింపులను నిరోధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన చట్టాలు కూడా నిరుపయోగంగా కనిపిస్తున్న దశలో, అటు రాజకీయ పార్టీలు, ఇటు సభాపతులు నైతిక నిబద్ధతలకు కట్టుబడి ఉండకపోవడం పెద్ద సమస్య. ఫిరాయించినవారిని ప్రోత్సహించేలా పార్టీలు వ్యవహరించడం,అలాంటివారిపై చర్యలు తీసుకోవడం సర్వాధికారాలు ఉన్న స్పీకర్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం ఫిరాయింపుల నిరోధానికి ప్రధాన అడ్డంకి. స్పీకర్ దగ్గరకు ఫిర్యాదు వచ్చినప్పుడు దానిపై వెంటనే చర్యలు తీసుకోక పోవడం వల్ల ఇలాంటి ఫిరాయింపులు కొనసాగే పరిస్థితి ఉంది.
కొంతమంది స్పీకర్లు సభాకాలం ముగిసేవరకు నిర్ణయాలు తీసుకోని సందర్భాలున్నాయి. ఫిరాయింపులపై చర్యలకు కాలపరిమితి లేకపోవడం, సంకీర్ణ రాజకీయాల కాలంలో స్పీకర్లు ఏదో ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితులు సమస్యను పెంచుతున్నాయన్న అభిప్రాయం ఉన్నది. మొత్తంమీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో 'ఫిరాయింపుల' అంశంపై మళ్ళీ చర్చ జరుగుతోంది. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై రాష్ట్ర హైకోర్టులో ఆశించిన ఫలితం రానందున సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. త్వరలోనే ఈ పది చోట్ల 'ఉప ఎన్నిక' జరగనున్నదంటూ కేటీఆర్ ఒక ప్రచారం మొదలుపెట్టారు.
సింగిల్ మెంబర్‌గానో, కొద్దిమందిగానో వెళితే ఫిరాయింపుల చట్టం ప్రకారం వేటు పడటం ఖాయం కాబట్టి, ఒక్కొక్కరికే కండువా కప్పి మూండింట రెండు వంతులకు సరిపడే సంఖ్యకు చేరుకున్నాక, పార్టీ విలీనం పేర ఫిరాయింపులకు కొత్త ఒరవడి సృష్టించిన చరిత్ర కేసీఆర్‌దే.ఇది కేసీఆర్ ట్రెండ్‌గా మారింది. ఇదే ఒరవడిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే బీఆర్ఎస్ యజమానులు నైతిక విలువల గురించి మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
- ఎస్.కే.జకీర్, సీనియర్ జర్నలిస్ట్-