- మద్దతు ధర కంటే ఏడెనిమిది వందలు ఎక్కువే
- పంట సాగు తగ్గడం, ఇథనాల్ తయారీకి వినియోగం పెరగడంతో డిమాండ్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో మక్కలకు మస్తు ధర పలుకుతున్నది.మద్దతు ధర రూ.2,225 కాగా, అంతకంటే ఏడెనిమిది వందలు ఎక్కువే రేటు వస్తున్నది. క్వింటాల్ కు రూ.3వేల దాకా పెట్టి మరీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
మార్కెట్లో మక్కలకు ఇంత ఎక్కువ ధర రావడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. ఓవైపు పంట సాగు తగ్గడం, మరోవైపు ఇథనాల్ తయారీలో మక్కల వినియోగం పెరగడంతో మస్తు డిమాండ్ ఉంటున్నదని మార్కెటింగ్‌శాఖ అధికారులు అంటున్నారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మక్కలకు గత నెల రోజుల్లో అత్యధికంగా రూ.2,961 రికార్డు ధర పలికింది. కనిష్టంగా రూ.2,712 వరకు వచ్చింది. ఇక గత వారం రోజుల్లో కనిష్టంగా రూ.2,902 పలకగా, గరిష్టంగా రూ.2,961 పలికింది. గత నెల రోజులుగా ఏనాడూ మద్దతు ధర కంటే తక్కువ పలకలేదు.
గత సర్కార్ తీరుతో తగ్గిన సాగు..
గత బీఆర్ఎస్ సర్కార్ తీరుతోనే రాష్ట్రంలో మక్కల సాగు తగ్గింది. ‘‘వర్షాకాలంలో మక్కలకు బదులు వేరే పంటలు వేయాలి. గవర్నమెంట్ వ్యాపార సంస్థ కాదు.. ప్రతిసారీ మక్కలు కొనలేం. మన అవసరాలకు తగ్గట్టు యాసంగిలో మాత్రమే వేసుకోవాలి. వర్షాకాలంలో మక్కలు వద్దే వద్దు” అంటూ రైతులపై ఆనాడు సర్కార్ ఆంక్షలు విధించింది.
దీంతో చాలామంది రైతులు మక్క సాగును బంజేశారు. ఫలితంగా గత నాలుగేండ్లలో వానాకాలం మక్కల సాగు గణనీయంగా తగ్గింది. సాధారణ సాగు 6.09 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 5.11 లక్షల ఎకరాల్లోనే సాగైంది.
ఇథనాల్ తయారీతో డిమాండ్
మన దేశంలో ఇథనాల్ వినియోగం పెరుగుతున్నది. గతంలో ఇథనాల్ తయారీకి చెరుకు ఎక్కువగా వినియో గించేవారు. కానీ ఇప్పుడు మక్కలు ఎక్కు వగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కోళ్లు, పశువుల దాణాగానూ మక్కల వినియోగం పెరిగింది. అందుకే మార్కెట్లో మక్కలకు డిమాండ్ఉంది.
- లక్ష్మీబాబు, అడిషనల్ డైరెక్టర్, మార్కెటింగ్