అమెరికాలో డజన్ కోడిగుడ్లు వెయ్యి రూపాయలు : గుడ్లు తేలేస్తున్న జనం

అమెరికాలో డజన్ కోడిగుడ్లు వెయ్యి రూపాయలు : గుడ్లు తేలేస్తున్న జనం

గుడ్డు.. కోడి గుడ్డు.. ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది.. భయపెడుతోంది. కోడి గుడ్లు కొనాలంటే అమెరికన్లు అమ్మ బాబోయ్ అంటున్నారు. దీనికి కారణం.. డజన్ కోడి గుడ్లు 14 డాలర్లకు చేరింది. అంటే మన రూపాయల్లో 11 వందల రూపాయలు. డజన్ కోడి గుడ్లు.. అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో కనీసంలో కనీసం 10 డాలర్ల నుంచి 14 డాలర్ల వరకు చేరుకుంది. అంటే అమెరికా దేశ వ్యాప్తంగా డజన్ కోడిగుడ్లు 900 నుంచి 11 వందల రూపాయల వరకు ఉన్నాయి. అంటే ఒక్క కోడి గుడ్డు డాలర్.. మన రూపాయల్లో ఒక్కో కోడిగుడ్డు 85 రూపాయలు. 

ఇంత ధర పెరగటానికి కారణం వైరస్.. అవును బర్డ్ ఫ్లూ. ఈ వైరస్ కారణంగా గుడ్లు పెట్టే కోళ్లను లక్షల సంఖ్యలో చంపేశారు అమెరికా అధికారులు. 2022 నుంచి 2024 మధ్య కాలంలో.. అంటే రెండేళ్లలో 166 మిలియన్లకు పైగా గుడ్డు పెట్టే కోళ్లను చంపేశారు అధికారులు. దీంతో అమెరికా వ్యాప్తంగా కోడి గుడ్ల సరఫరా సగానికి సగం పడిపోయింది.

2023లో డజన్ కోడిగుడ్ల ధర 2 డాలర్లుగా ఉంటే.. 2024 నాటికి 5 డాలర్లకు చేరుకుంది. ఇక ఇప్పుడు 2025 మార్చి నాటికి ఇది 10 నుంచి 14 డాలర్లకు చేరుకుంది. చికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ప్రధానమైన నగరాల్లో.. రిటైల్ మార్కెట్ లో డజన్ కోడి గుడ్లు 10 డాలర్ల నుంచి 14 డాలర్లుగా ఉంది. దీంతో అమెరియన్స్ కోడి గుడ్డు అంటే గుడ్లు తేలేస్తున్నారు.

Also Read:-21 ఏండ్లు నిండిన మనోళ్లకు బహిష్కరణ ముప్పు! 

ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుంది అంటే కనీసంలో కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు ఉంటుందని అంటున్నారు. అంటే 2025 ఏడాది మొత్తం కోడి గుడ్ల ధర తగ్గేది లేదు అంటున్నారు. కారణం కూడా చెబుతున్నారు అధికారులు. గుడ్డు పెట్టే కోళ్లను పెంచి.. ఆ గుడ్లు మార్కెట్లోకి రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది ఫౌల్ట్రీ ఫాంలు ఇప్పుడ మూతపడి ఉన్నాయని.. వాటిని క్లీన్ చేసి.. మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని.. అన్ని జాగ్రత్తలతో మళ్లీ కోళ్లను పెంచాల్సి ఉంటుందని.. దీనికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు అధికారులు. 

కోడి గుడ్ల ధరలపై అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లలో కోళ్లను పెంచుకోవాలని సూచించారు. ట్రంప్ సూచనలతో ఇప్పటికే రెంట్ ద చికెన్ పేరుతో కొత్త మార్కెటింగ్ మొదలైంది. ఆరు నెలల కాలానికి అద్దెకు కోళ్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక్కో కోడి వారానికి ఐదు గుడ్లు పెడుతుందని.. ఒక్కో కుటుంబం ఐదు కోళ్లు అద్దెకు తీసుకోవాలంటూ రెంట్ ది చికెన్ కంపెనీ ఓనర్ రోలిన్స్ పిలుపునిచ్చారు. 

మొత్తానికి అమెరికాలో కోడి గుడ్డు ఇప్పుడు కొత్త లొల్లి చేస్తుంది. కొక్కరొకో అనటం కాదు.. అమ్మ బాబోయ్ అంటున్నారు జనం..