నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే ఎందుకు ఎక్కువ?

ఆదాయాలు పడిపోవడం ఒక సమస్య అయితే, నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడం మరొక పెద్ద సమస్య. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రజలు వాడే కొన్ని ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ధరలు 7%  నుంచి 63% వరకు పెరిగాయి. ప్రజలు నిత్యం వాడే కూరగాయల ధరల నుంచి పప్పు, బియ్యం వరకు సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. సామాన్య కుటుంబాల మొత్తం వ్యయంలో 60 - 80% ఆహారం, ఇంధనం, ఆరోగ్యం, విద్యపై ఉంటుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం, ప్రయాణ చార్జీలు భారీగా పెంచింది. దీంతో ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణాన్ని సాగించే తప్పనిసరి పరిస్థితి పెరిగింది. ఫలితంగా సామాన్యుడు సైతం పెట్రోల్, డీజిల్ వాడుతూ అదనపు ఆర్థిక భారం మోస్తున్నాడు. 
ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే పెట్రోల్​, డీజిల్​ ధరలు అధికంగా ఉన్నందున  సరుకు రవాణా చార్జీలు అధికమై తెలంగాణలో అన్ని వస్తువుల ధరలు అధికంగా మారాయి. 

పె ట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని రకాల వస్తు సేవల ధరల్లో  పెరుగుదల స్పష్టంగా కనబడుతూ ఉంటుంది.  అంతర్జాతీయంగా కూడా పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ పెరుగుదల భారం ప్రజలపై తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల పై ఎక్సైజ్ సుంకాల్ని తగ్గించింది.  దేశంలో అత్యధిక రాష్ట్రాలు ప్రజల భారాన్ని తగ్గించడం కోసం, తమ రాష్ట్ర పన్నుల్లో తగ్గించుకోవడం జరిగింది. తద్వారా పెట్రో భారం ప్రజలపై తగ్గి, వస్తుసేవల ధరలు కూడా ఆయా రాష్ట్రాల్లో కొంతమేరకు తక్కువగానే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించకపోవడంతో అక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు గరిష్టంగా ఉన్నాయి.  దీనితో  ఆ  రాష్ట్రాల్లో కూడా   ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంది.  రాష్ట్ర ప్రభుత్వానికి ధరల నియంత్రణపై దృష్టి ఏది?                                                                                                            

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ధరల నియంత్రణకు సంబంధించి చర్యలు పెద్దగా చేపట్టలేదు. పెట్రోల్, డీజిల్ వాటిలో రాష్ట్రాల వ్యాట్ ను తగ్గించకపోయినా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో మంచి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)  ద్రవ్యోల్బణ రేట్లను తగ్గించడంలో సహాయపడింది. కేరళలో, పీడీఎస్​ దుకాణాలే కాకుండా, ప్రజలకు పౌర సరఫరాలను తక్కువ ధరకు అందించడంలో సహాయపడే అనేక మార్జిన్ -ఫ్రీ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా ఉన్నాయి. తమిళనాడు విషయానికొస్తే, రాష్ట్రం తన పీడీఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అనేక ఉత్పత్తులను అందిస్తుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి కేరళ ద్రవ్యోల్బణం రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండగా, తమిళనాడు ఈ సంవత్సరం జనవరి నుంచి జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. ప్రజల పైన ధరల భారాన్ని తగ్గించడానికి తెలంగాణ రాష్ట్రం కేరళ తరహాలో వివిధ వస్తువులు, సేవలను ప్రజలకు అందించినట్లయితే, ధరలు అదుపులోకి వచ్చి పేద ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా చూడవచ్చు. ఆర్టీసీ బస్సుల టికెట్ చార్జీలు, ఇంట్లో కరెంట్ బిల్లులు, ఇంటి పన్ను, ఆస్తి పన్ను, ఆల్కహాల్ ధరలు, రిజిస్ట్రేషన్  ఫీజులు వంటివి దాదాపుగా 70 శాతం పైగా పెరిగాయి. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకోవడం కానీ పేద ప్రజలకు సరైన మార్గంలో సంపద పంపిణీ జరగకపోవడంతో అధిక ధరలను మోస్తున్నారు. 

గ్యాస్ ధరల గలాటా ఏమిటి?

అన్ని కుటుంబాల్లో దాదాపుగా గ్యాస్ ఆధారంగా వంట చేస్తారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో చాలా కుటుంబాలు గ్యాస్ వినియోగ విషయంలో చాలా పొదుపుగా వాడుతూ, సాధ్యమైనంత మేరకు గ్యాస్ వాడకాన్ని తగ్గిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబానికి ఏడాదికి ఐదు నుంచి ఆరు సిలిండర్లు  సరిపోతాయి. 2012--–13లో కేల్కర్ కమిటీ పై విషయాలను ఉదహరిస్తూ, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ద్వారా గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య వ్యాపారాలకి పెద్ద ఎత్తున తరలించడం జరుగుతుందని  పేర్కొన్నారు. కేల్కర్ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి  నకిలీ లబ్ధిదారులను తొలగించాలన్నది. దాంతో నకిలీ లబ్దిదారుల సమస్య, స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మళ్లింపు సమస్యలను పరిష్కరించింది. తదుపరి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత కనెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించడం ద్వారా ప్రభుత్వం సుమారు 90 మిలియన్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చగలిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కలిగిన కుటుంబాలకి రూ. 200  సబ్సిడీని వారి ఖాతాల్లో  నేరుగా జమ చేస్తున్నది.  ఈ స్కీం ద్వారా ఏడాదికి గరిష్టంగా 12 సిలిండర్లను ఒక కుటుంబానికి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సబ్సిడీ అనేది పేద, ధనిక తేడాలు లేకుండా గతంలో ఇవ్వడం  ప్రభుత్వానికి భారంగా మారింది. నిజమైన లబ్ధిదారులకి అన్యాయం జరుగుతూవచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం నియంత్రించేనా?

ధరల పెరుగుదల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి  ప్రజలపై భారాన్ని తగ్గించే విధంగా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆహార ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నిత్యం ప్రజలు వాడే ఆహార పదార్థాల ధరలు  అందుబాటులో లేకపోవడం శోచనీయం. తెలంగాణ ధనిక రాష్టమని, అభివృద్ధిలో శరవేగంగా దేశంలో దూసుకుపోతుందని చెప్తున్నారు. కానీ  నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు  అదుపు చేయలేకపోతుందో తెలియదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టపరిచి ప్రజల భారాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాలి. అపుడు మాత్రమే సామాన్య ప్రజలకు అధిక ధరల భారం నుంచి కొంతైనా ఊరట లభిస్తుంది. - చిట్టెడి కృష్ణారెడ్డి,అసిస్టెంట్​ ప్రొఫెసర్​,హెచ్​సీయూ