హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. ప్రధాన మార్కెట్లకు దిగుమతులు తగ్గుతుండడంతో రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు చాలా జిల్లాల్లోని కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సిటీకి దిగుమతులు తగ్గుతున్నాయి. మూమూలు రోజులతో పోలిస్తే దాదాపు 50 శాతం దిగుమతులు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది. సిటీలో ప్రధాన హోల్సేల్మార్కెట్లయిన గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, మాదన్నపేట, ఎల్బీనగర్, సికింద్రాబాద్ మోండా మార్కెట్లకు వచ్చే కూరగాయల శాతం తగ్గుతోంది. ప్రధానంగా మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల సిటీకి కూరగాయలు వస్తాయి. ఆయా జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు ముసురుకు పొలాల్లోనే దెబ్బతింటున్నాయి.
ఆ ప్రభావం సప్లయ్మీద పడుతోంది. నెల కింద కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు తగ్గుతున్నాయిలే అనుకునేలోపు తిరిగి పెరగడం ప్రారంభమైంది. మామూలు రోజుల్లో సిటీకి డెయిలీ 25 నుంచి 30 లారీల టమాటాలు వస్తుండగా, 10 నుంచి 15కు మించడం లేదని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక వైపు నుంచి వచ్చే కూరగాయలు తగ్గాయంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సరుకంతా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నదేనని చెబుతున్నారు.
టమాటా కిలో రూ.80సిటీలోని మార్కెట్లలో టమాటా కిలో రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. సూపర్మార్కెట్లలో రూ.100కు చేరుకుంది. కిలో వంకాయ రూ.60, బీరకాయ రూ.80, గోకరకాయ రూ.80, బుడమకాయ రూ.60, చిక్కుడుకాయ రూ.80, బెండకాయ రూ.60, ఆలుగడ్డ రూ.50 నుంచి రూ.60 పలుకుతోంది. చాలా రకాల కూరగాయలు మార్కెట్లలో కనిపించడం లేదు. ఉన్నవాటి ధరలు మండిపోతున్నాయి. ధరలు సాధారణ స్ధితికి రావడానికి మరో రెండు నెలలు పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలకు పంట కొట్టుకుపోవడం, పొలాల్లోనే కుల్లిపోవడంతో చాలాచోట్ల రైతులు కొత్త పంట వేశారు. అది చేతికి రావడానికి టైం పడుతుందని అంటున్నారు.
ప్రధాన మార్కెట్లలోని కూరగాయల ధరలు
- రకం కిలో ధర
- టమాటా 70-80
- బెండకాయ 50-60
- బీరకాయ 70-80
- వంకాయ 60-70
- చిక్కుడుకాయ 60-70
- ఆలుగడ్డ 50-60
- దొండకాయ 40-50
- గోకరకాయ 70-80
- కాలిఫ్లవర్(ఒకటి) 40-45
- ములక్కాడ(ఒకటి) 10-15