సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు..

సరూర్ నగర్  అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు..

అప్పట్లో సంచలనం రేపిన సరూర్ నగర్ అప్సర హత్యకేసులో సంచలన తీర్పు వెల్లడించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఈ కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు గాను ఏడేళ్లు అదనపు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు బుధవారం ( మార్చి 26 ) తీర్పు వెల్లడించింది రంగారెడ్డి కోర్టు.

అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నాలుగేళ్ళ పాటు ప్రేమకలాపాలు జరిపిన సాయికృష్ణ అప్సరను కిరాతకంగా చంపడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.శంషాబాద్ లో అప్సరను హత్య చేసిన పూజారి.. కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. హత్య జరిగిన సుమారు రెండేళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెల్లడించింది కోర్టు. 

సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో  బంగారు మైసమ్మ కాశీ వైద్య నాథేశ్వర దేవాలయం ఉంది. ఈ గుడికి ఓ వైపు ఇంట్లో అప్సర కుటుంబం నివాసం ఉంటుంది. గుడికి మరో వైపు అపార్ట్ మెంట్ లో పూజారి సాయి కృష్ణ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. అప్సరకు దైవ భక్తి ఎక్కువ కావటంతో.. ప్రతి రోజూ  అప్సర ఆలయానికి వస్తుంది. పూజలు ఉన్నప్పుడు వాలంటీర్ సేవలు కూడా చేస్తుంది. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే అమ్మాయి కావటంతో.. ఆ ప్రాంతంలో అందరికీ పరిచయమే. ఇక పూజారి సాయి కృష్ణ సైతం ఆ కాలనీలో అందరికీ పరిచయం ఉన్న పూజారి. ఎంతో యాక్టివ్ గా సేవా కార్యక్రమాలు, నిత్య అన్నదానం చేస్తూ.. అందరి మన్ననలు పొందాడు. 

రోజూ గుడికి వచ్చే అప్సరతో పరిచయం ఏర్పడింది సాయి కృష్ణకు. అంతే కాకుండా అప్సర తల్లిని అక్కయ్య అంటూ మరింత దగ్గర అయ్యాడు. ఈ పరిచయం కాస్తా.. ఇద్దరి మద్య ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం రెండు కుటుంబాల్లో ఎవరికీ తెలియలేదు. అప్సర ఇంటికి తరచుగా సాయి కృష్ణ వస్తున్నా.. వాళ్లకు కూడా అనుమానం రాలేదు. ఇంట్లో మనిషిగా కలిసిపోయాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లేవారని చుట్టుపక్కల వారు కూడా చెబుతున్నారు. 

వివాహేతర సంబంధాన్ని ఎన్నాళ్లో కొనసాగించలేమని భావించిన అప్సర.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. వాస్తవంగా అయితే అప్పటికే సాయి కృష్ణకు పెళ్లయ్యి.. నాలుగేళ్ల బిడ్డ కూడా ఉంది. అలాంటి పూజారి సాయి కృష్ణతో ప్రేమ, వివాహేతర సంబంధం వరకు అప్సర రావటం విశేషం. సాయి కృష్ణకు పెళ్లయిన విషయం అప్సరకు ముందే తెలుసా లేదా అనేది ఇప్పటికి అయితే మిస్టరీగానే ఉంది. 

గుడిలో పూజారిగా ఎంతో పేరున్న సాయికృష్ణ.. అప్సరను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. అప్సర బతికి ఉంటే.. తమ ప్రేమ,  వివాహేతర సంబంధం ఎక్కడ బయట పడుతుందో అని భయపడ్డాడు. దీంతో పక్కా ప్లాన్ గా అప్సరను హత్య చేసి.. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అప్సర వాళ్ల ఇంటికే వచ్చి.. భద్రాచలం వెళ్లినట్లు చెప్పాడు. ఆ తర్వాత తానే స్వయంగా పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు ఈ కేసును తమదైన శైలిలో విచారించగా సాయికృష్ణ దోషిగా తేలింది.. ఎట్టకేలకు నిందితుడికి జీవితఖైదు ఖరారవ్వడంపై అప్సర కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.