- నేటి నుంచి స్టేజ్ 3 ఆంక్షలు అమలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత సూచి 452కి చేరుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా సమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం విమాన సర్వీసులపై పడింది. దీంతో గురువారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని ఫ్లైట్ రాడార్ 24 సంస్థ తెలిపింది. ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు, ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 226 విమానాలు ఆలస్యంగా నడిచాయయని ఫ్లైట్ ట్రాకర్ వెబ్‌సైట్ తెలిపింది.
కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటున్నది. 24 గంటల్లోనే గాలి నాణ్యత సూచి 418 నుంచి 452కి చేరుకుంది. ఢిల్లీలో ఏక్యూఐ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 452 నమోదై తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. దీంతో శుక్రవారం నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) 3వ దశను అమలు కానుంది. ఇందులో భాగంగా ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక జీఆర్ఏపీ -3 అమలులో ఉన్నప్పుడు నిర్మాణాలు, కూల్చివేతలు, అనవసరమైన మైనింగ్ కార్యకలాపాలను నిలిపేస్తారు. నాన్-ఎలక్ట్రిక్, నాన్-సీఎన్జీ, నాన్-బీఎస్ 4 డీజిల్ అంతర్రాష్ట్ర బస్సులపై ఆంక్షలు విధిస్తారు.
గ్యాస్ చాంబర్‌లోకి ప్రవేశించినట్టుంది: ప్రియాంక
ఢిల్లీలోకి అడుగుపెడితే గ్యాస్ చాంబర్‌లోకి వచ్చినట్టు ఉందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల తర్వాత గురువారం ఆమె తిరిగి ఢిల్లీకి వచ్చారు. “వయనాడ్లో ఏక్యూఈ 35 ఉంది. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి రావడం గ్యాస్ చాంబర్‌లోకి ప్రవేశించినట్టుగా ఉంది. పొగ మంచు మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది” అని ఆమె ట్వీట్ చేశారు. "ఢిల్లీలో కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో పరిశుభ్రమైన గాలి కోసం పార్టీలకు అతీతంగా పరిష్కారాలు కనుగొనాలి”అని ఆమె పేర్కొన్నారు.