ప్రధానమంత్రి ఫసల్​ బీమాతో రైతన్నకు భరోసా

ప్ర్రధానమంత్రి ఫసల్​ బీమా యోజన(పీఎంఎఫ్​బీవై). రైతులకు పంటల సమయంలో ఎదురయ్యే ప్రకృతి సిద్ధమైన రిస్క్​లన్నింటి నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం. రైతులకు అతి తక్కువ ప్రీమియంతో తమ పంటలకు అధిక బీమా కవరేజీ కల్పించే అతి పెద్ద రిస్క్​ నివారణ పథకం ఇది. ఐఆర్డీఏఐ వద్ద రిజిస్టర్​ అయిన, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించిన జనరల్​ ఇన్సూరెన్స్​ కంపెనీలన్నీ ఈ స్కీమ్​ నిర్వహించే జాబితాలో ఉన్నాయి. ఐఆర్డీఏఐ వద్ద నమోదైన 5 ప్రభుత్వ కంపెనీలు, 13 ప్రైవేటు కంపెనీలు ప్రస్తుతం ఈ ప్యానెల్​లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కార్యకలాపాలు సాగించే కంపెనీల సమగ్ర నెట్​వర్క్​ను ఉపయోగించుకుంటూ వాటి సంఖ్య పెంచడం, స్కీమ్​ అమలులో ప్రైవేటు రంగ సామర్థ్యాలను పూర్తిగా వాడుకోవడం ఈ పథకం మౌలిక ఆలోచన. ఐదేండ్ల క్రితం మొదలైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ రూ.86,800 కోట్లను క్లెయిమ్​ల రూపంలో కంపెనీలు చెల్లించాయి.

పథకం ప్రారంభించి ఐదేండ్లు

పీఎంఎఫ్​బీవై స్కీమ్ ప్రస్తుతం ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. రైతులందరికీ స్కీమ్ లో చేరడాన్ని ఐచ్ఛికం చేయడంతోపాటు టెక్నాలజీ బలాన్ని ఉపయోగించుకుని దాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు పరిచేందుకు వీలుగా ఇటీవల స్కీమ్ లో కొన్ని మార్పులు చేశారు. ఈ స్కీమ్ లో భాగస్వాములైన ప్రైవేటు రంగ కంపెనీలు, బీమా కంపెనీలు దీని ద్వారా అసాధారణ లాభాలు ఆర్జిస్తున్నాయి. అందుబాటులో ఉన్న పూర్తి స్థాయి డేటా ప్రకారం.. స్కీమ్ అమలులోకి వచ్చిన తొలి మూడేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో బీమా కంపెనీలన్నింటి క్లెయిమ్ పరిష్కారం 89 శాతం ఉంది. అంటే బీమా కంపెనీలు వసూలు చేసిన ప్రతి 100 రూపాయల్లోనూ 89 రూపాయలు క్లెయిమ్ గా చెల్లించాయి. బీమా కంపెనీలకు 10–12 శాతం రీ ఇన్సూరెన్స్​, పాలనాపరమైన వ్యయాలుంటాయి. అందుకే మంచి రుతుపవనాలున్నప్పటికీ తొలి మూడేండ్ల కాలంలో బీమా కంపెనీలు బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. రిస్క్ కవరేజి ఇచ్చే ఏ కార్యక్రమాన్ని అయినా కనీసం ఐదేండ్ల పాటు విస్తరించిన కాలపరిమితిలో మదింపు చేయాలి. ఒక నిర్దిష్ట సీజన్ లో లేదా ఏడాదిలో కంపెనీ లాభాలు లేదా నష్టం నిష్పత్తి ఎంత ఉందనే అంశం ఆధారంగా వాటి పనితీరును మదింపు చేయడం సరైన వైఖరి కాదు.

క్లెయిమ్​ల నిష్పత్తి పెరుగుతోంది

క్లెయిమ్ ల నిష్పత్తి చాలా తక్కువగా ఉన్నదని, ప్రైవేటు కంపెనీలు సహా బీమా కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయని విమర్శలున్నాయి. కానీ, అసంపూర్తి డేటాయే ఈ నిరాధారమైన విమర్శలకు కారణం. పూర్తి స్థాయి గణాంకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్లెయిమ్ నిష్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రజలకు అందుతున్న గణాంకాల్లో లోపాలను తొలగించేందుకు వ్యవసాయ శాఖ ప్రతి నెలా సీజన్ల వారీ డేటా విడుదల చేయడం ప్రారంభించింది. నిపుణులు తాజా గణాంకాల ఆధారంగా స్కీమ్ పని తీరును మదింపు చేసేందుకు ఇది వీలు కల్పించింది. మూడు సంవత్సరాల కాలపరిమితి(2016–17 నుంచి 2018–19)లో ప్రభుత్వ, ప్రైవేటు బీమా కంపెనీల డేటా విశ్లేషించిన తర్వాత క్లెయిమ్ ల పరిష్కార నిష్పత్తి ప్రభుత్వ కంపెనీల్లో 98.5 శాతం, ప్రైవేటు కంపెనీల్లో 80.3 శాతం ఉన్నట్టు తేలింది. 2019 ఖరీఫ్ పంట కాలానికి గుజరాత్, జార్ఖండ్, కర్నాటక నుంచి సీసీఈ డేటా అందింది. ఆరు రాష్ట్రాల నుంచి 2019–20 డేటా అందలేదు. ఈ డేటా కూడా అందిన తర్వాత 2019–20 సంవత్సరపు తుది క్లెయిమ్ నిష్పత్తి గణనీయంగా పెరుగుతుంది.

పంటల బీమాలో విప్లవాత్మక మార్పు

2020 ఖరీఫ్ పంట కాలం నుంచి అమలులోకి వచ్చిన పునరుత్తేజిత పథకం కింద బీమా కంపెనీలకు  కనీసం మూడు సంవత్సరాల కాలానికి పథకం అప్పగిస్తారు. వసూలు చేసిన ప్రీమియంతో పోల్చితే బీమా కంపెనీలు పరిష్కరించిన క్లెయిమ్ లను విశ్లేషించేందుకు ఇది ఆదర్శ కాలపరిమితిగా చెప్పవచ్చు. చారిత్రకంగా దిగుబడులకు సంబంధించిన గణాంకాలు సూక్ష్మ స్థాయిలో అందుబాటులో లేకపోవడం, గణాంకాల రూపకల్పన, పంపిణీ, దిగుబడి గణాంకాల రికార్డింగ్ లో మానవ తప్పిదాలు వంటివి ప్రీమియంలు పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ గణాంకాలు, భూమిలో తేమకు సంబంధించిన గణాంకాలతో కూడిన డేటా ఆధారంగా టెక్నాలజీ సహాయంతో దిగుబడులు అంచనా వేయడం ప్రీమియం రేట్లు తగ్గడానికి, స్కీమ్ అమలులో స్థిరత్వానికి దోహదపడతాయి. ప్రముఖ ప్రభుత్వ, అంతర్జాతీయ, ప్రైవేటు టెక్నికల్ ఏజెన్సీల సహకారంతో వచ్చే రెండేండ్ల కాలంలో దిగుబడులను మదింపు చేసేందుకు వ్యవసాయ శాఖ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంటల బీమా అమలులో విప్లవాత్మక మార్పునకు ఇది సాయపడడంతోపాటు చిన్నకారు రైతుల దీర్ఘకాలిక అవసరాలు తీరడానికి వీలు కలుగుతుంది.-సుధాంశు పాండే, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి.