రిజర్వేషన్ల రద్దుకు రాహుల్ కుట్ర.. తండ్రి లెక్కనే కొడుకు ప్రయత్నాలు: ప్రధాని మోదీ

రిజర్వేషన్ల రద్దుకు రాహుల్ కుట్ర.. తండ్రి లెక్కనే కొడుకు ప్రయత్నాలు: ప్రధాని మోదీ

దేవ్ గఢ్/గొడ్డా/దర్భంగా: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బలహీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. బుధవారం జార్ఖండ్​లోని దేవ్ గఢ్, గొడ్డాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బిహార్ లోని దర్భంగాలో ఎయిమ్స్​కు శంకుస్థాపన చేశారు. రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఆలోచనలు ఉన్నాయి. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నాడు. 

ఆ యువరాజు తండ్రి (రాజీవ్ గాంధీ) రిజర్వేషన్లను బానిసత్వంగా పేర్కొన్నాడు. రిజర్వేషన్లను తొలగించాలని అడ్వర్టయిజ్​మెంట్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు యువరాజు అలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆ కుట్రలను మనం అడ్డుకుందాం” అని పిలుపునిచ్చారు. జార్ఖండ్​లోని జేఎంఎం సర్కార్ చొరబాటుదారులకు సాయం చేస్తున్నదని ఆరోపించారు. వాళ్లు పర్మనెంట్ సిటిజన్స్ గా మారేందుకు అనుమతి ఇస్తున్నదని మండిపడ్డారు. ‘‘చొరబాట్ల కారణంగా సంథల్ పర్గనా డివిజన్​లో గిరిజనుల జనాభా సగానికి తగ్గిపోయింది. ఇదిలాగే కొనసాగితే వాళ్ల ఉనికికే ప్రమాదం. జార్ఖండ్ ప్రజల భద్రతతో జేఎంఎం ప్రభుత్వం ఆడుకుంటున్నది” అని ఫైర్ అయ్యారు. జార్ఖండ్ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న దోషులు పాతాళంలో దాక్కున్నా బయటకు తీసుకొస్తామని చెప్పారు.

నితీశ్ పై పొగడ్తల వర్షం.. 

బిహార్ సీఎం నితీశ్ కుమార్​పై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన ప్రజలు మెచ్చిన సీఎం అంటూ కితాబిచ్చారు. ‘‘నితీశ్ బాబు సుపరిపాలనకు ఆదర్శంగా నిలిచారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్ ను బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కార్​లో బిహార్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది” అని అన్నారు. దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. ‘‘కాంగ్రెస్ హయాంలో నాలుగైదు ఎయిమ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 24కు పైగా పెంచాం. దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా బలహీన వర్గాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. హిందీ, ఇతర స్థానిక భాషల్లోనూ వైద్య కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు.. మరో 75 వేల మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం” అని వెల్లడించారు. దర్భంగాలోని ఎయిమ్స్ ద్వారా బెంగాల్​ ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.

మోదీ కాళ్లు మొక్కేందుకు నితీశ్ యత్నం

దర్భంగాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ కాళ్లు మొక్కేందుకు నితీశ్ కుమార్ ప్రయత్నించారు. అయితే మోదీ వెంటనే ఆయనను అడ్డుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.