బందర్ సేరి బెగవాన్(బ్రూనై): ప్రధాని మోదీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం బ్రూనై వెళ్లారు. మంగళవారం బ్రూనై రాజధాని బందర్ సేరి బెగవాన్ చేరుకున్నారు. అక్కడి ఎయిర్ పోర్టులో క్రౌన్ ప్రిన్స్ హాజీ అల్ ముహ్తదీ బిల్లా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ దేశ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం హోటల్‌కు చేరుకున్న మోదీని భారత సంతతి పౌరులు స్వాగతించారు. వాళ్లతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ బాలిక మోదీకి ఆయన స్కెచ్‌ను గిఫ్ట్ గా ఇచ్చింది. మోదీ ఆ పాపకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. బ్రూనై, భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 40 ఏండ్లవుతున్న సందర్భంగా మోదీ ఈ టూర్‌కు వెళ్లారు. ద్వైపాక్షిక పర్యటన కోసం బ్రూనై వెళ్లిన మొదటి భారత ప్రధాని మోదీనే.
‘‘నేను బ్రూనై చేరుకున్నాను. ఎయిర్ పోర్టులో స్వాగతం పలికినందుకు క్రౌన్ ప్రిన్స్ హాజీ అల్ ముహ్తదీ బిల్లాకు ధన్యవాదాలు. రెండు దేశాల మధ్య బంధాలను బలోపేతం చేసుకునేందుకు, బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, మోదీ బుధవారం బ్రూనై నుంచి సింగపూర్ వెళ్తారు. ఆ దేశ ప్రెసిడెంట్ ధర్మాన్ షణ్ముగరత్నం, ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ అవుతారు. ‘‘మన యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో పసిఫిక్ విజన్‌లో బ్రూనై, సింగపూర్ రెండు కీలకమైన దేశాలు. నా పర్యటన ఈ రెండు దేశాలతో బంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
7 వేల కార్ల రాజు..
విలాసవంతమైన జీవితానికి పెట్టింది పేరు బ్రూనై రాజు హసనల్ బోల్కియా. ఆయన ఆస్తి 30 బిలియన్ డాలర్లు. దేశంలోని ఆయిల్, గ్యాస్ వనరుల నుంచే ఆదాయం వస్తుంది. ఆయన నివాసమే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ప్యాలెస్.. ఆయనకు మొత్తం 7 వేలకు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి.