ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు . హాస్పిటల్ పూర్తి అయి నెలలు గడుస్తున్నా.. ఇంకా పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందకపోవటం ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇటీవల హాస్పిటల్ ను పరిశీలించిన కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలను ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు PMO వర్గాలు తెలిపాయి. గురువారం జరిగిన కేంద్ర కేబినేట్ మీటింగ్ లో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రిమ్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టును కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. కనీసం డాక్టర్లను కూడా నియమించుకోలేని పరిస్థితిలో తెలంగాణా ప్రభుత్వం ఉందా అని ప్రధాని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. కోట్లు పెట్టి ఇంతపెద్ద హాస్పిటల్ కట్టిస్తే రాష్ట్రప్రభుత్వం వైద్యసేవలు కూడా అందించడం లేదా అని ప్రధాని కేబినేట్ భేటీలో ప్రస్తావించినట్లు తెలిసింది.
ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను... ప్రధానమంత్రి స్వస్థి సురక్ష యోజన కింద కేంద్ర నిధులు 120 కోట్లు, రాష్ట్రవాటా 30 కోట్లతో నిర్మించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు 52 పోస్టులు మంజూరయ్యాయి. కానీ ఇప్పటివరకు కేవలం 09 మంది డాక్టర్లను మాత్రమే నియమించారు. ప్రస్తుతం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం పిడియాట్రిక్, యూరాలజీకి సంబంధించిన ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. మొదట్లో ముగ్గురు కార్డియాలజిస్టులు వచ్చినప్పటికీ హాస్పిటల్ ప్రారంభంలోనే వారు వెళ్లిపోయారు. మళ్లీ కొత్తగా ఒక్కరు కూడా రాలేదు. ప్రభుత్వం కూడా డాక్టర్ల నియామకంపై అంతగా శ్రద్ద చూపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వారికి అవసరమైన జీతాలు, వసతులు కల్పిస్తే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ రిమ్స్ వర్గాల్లో జరుగుతోంది. ప్రైవేట్ లో స్పెషలిస్టు డాక్టర్ల జీతం 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండగా.. రాష్ట్ర సర్కారు మాత్రం నెలకు లక్షా ఇరవై వేలు మాత్రమే ఇస్తుంది. అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కావడంతో ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పూర్తిస్థాయిలో డాక్టర్లను నియమించకుండానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన ఈ హాస్పిటల్ ను కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీ లేకుండానే ప్రారంభించడంపై విమర్శలు వచ్చాయి. ఎక్కడ కేంద్రానికి క్రెడిట్ పోతుందనే దురుద్దేశంతోనే హడావుడిగా హాస్పిటల్ ప్రారంభించారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పరికరాల కోసమే 70కోట్లు ఖర్చు చేశారు. కానీ స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడంతో న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీతో పాలు పలు విభాగాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన క్యాథలిక్ ల్యాబ్, వెంటిలేటర్ మానిటర్స్ ఇలా ఇతర ఎక్విప్ మెంట్ అంతా పక్కనపెట్టేశారు. 42ఐసీయూ బెడ్లు, 9 ఎమర్జెన్సీ వార్డులు, 7 ఆపరేషన్ థియేటర్లకు తాళం వేసి ఉంచారు. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉన్నందునే పీఎం స్పందించినట్లు తెలుస్తోంది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పీఎంవో సెక్రటరీ..ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు. ఈనెల 22న ఆదిలాబాద్ లో పర్యటించిన కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలకు రిమ్స్ పై ఫిర్యాదు చేసినందునే తనకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు పాయల్ శంకర్ చెప్పారు . పీఎంవో ఆఫీసర్లకు ఆదిలాబాద్ రిమ్స్ పరిస్థితిని వివరించానన్నారు.