భూటాన్​కు అండగా ఉంటం : ప్రధాని మోదీ

  •     అన్ని విధాలుగా సాయం చేస్తం: మోదీ 
  •     ముగిసిన ప్రధాని రెండ్రోజుల పర్యటన 

థింఫూ: భూటాన్ కు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఆ దేశాభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఐదేండ్లలో భూటాన్ కు రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. మోదీ శనివారం రెండోరోజు భూటాన్ లో పర్యటించారు. మన దేశం అందజేసిన ఆర్థిక సాయంతో ఆ దేశ రాజధాని థింఫూలో నిర్మించిన మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.

ఇది హెల్త్ కేర్ రంగంలో రెండు దేశాల మధ్య ఉన్న సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘భారత్ మాకెంతో సాయం చేస్తున్నది. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో చాలా మద్దతు ఇస్తున్నది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించుకోవడం గౌరవంగా భావిస్తున్నాం’’ అని భూటాన్ హెల్త్ మినిస్టర్ టాండిన్ వాంగ్ చుక్ అన్నారు. కాగా, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్ చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఎనర్జీ, ట్రేడ్, డిజిటల్ కనెక్టివిటీ, స్పేస్ అండ్ అగ్రికల్చర్ తదితర రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని, అందుకు దృఢసంకల్పంతో ఉన్నామని రెండు దేశాలు  ప్రకటనలో పేర్కొన్నాయి. 

ఢిల్లీకి మోదీ.. 

మోదీ రెండ్రోజుల భూటాన్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం అక్కడి పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మోదీకి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్ చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గే వీడ్కోలు పలికారు. ‘‘భూటాన్ పర్యటనను ఎప్పటికీ మరిచిపోలేను. అక్కడి ప్రజలు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. ఆ దేశ రాజు స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి వీడ్కోలు పలకడం గౌరవంగా భావిస్తున్నాను. భూటాన్ కు ఎప్పుడూ అండగా ఉంటాం” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో మోదీ పోస్టు పెట్టారు.