న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని మోడీ ఫోన్ చేశారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ టైమ్ సోమవారం (జనవరి 27) అతడికి ఫోన్ చేసి ప్రధాని మోడీ మాట్లాడారు. కంగ్రాట్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ అంటూ సెకండ్ టైమ్ ప్రెసిడెంట్‌గా ఎలెక్టైన ట్రంప్‌కు ఈ సందర్భంగా మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు కూలంకషంగా చర్చించారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం అమెరికా, భారత్ కలిసి పని చేస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. "నా ప్రియమైన మిత్రుడు, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. రెండోసారి చారిత్రాత్మక విజయం సాధించిన ట్రంప్‌ను ఈ సందర్భంగా అభినందించా. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాం. అమెరికా, భారత్ పరస్పర విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. ప్రజల సంక్షేమం ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పని చేస్తాం’ అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డెమొక్రటిక్ అభ్యర్థిని కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్ పార్టీ తరుఫున పోటీ చేసిన ట్రంప్ ఘన విజయం సాధించాడు. తద్వారా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించారు ట్రంప్. ఈ క్రమంలోనే 2025, జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చి రావడంతోనే ట్రంప్ తనదైన దూకుడుతో వ్యవహరిస్తున్నారు. జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేశారు. జన్మతః పౌరసత్వం రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకుని పాలనలో ట్రంప్ తనదైన మార్క్ ప్రదర్శిస్తున్నారు.