న్యూఢిల్లీ: ఆప్ పాలనలో ఢిల్లీ ఆగమైందని ప్రధాని మోదీ విమర్శించారు. 11 ఏండ్ల పాలనలో దేశ రాజధానిని ఆ పార్టీ నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రతి రంగంలోనూ ఆప్ అవినీతికి పాల్పడిందని, స్కామ్‌లు చేసిందని ఆరోపించారు. ‘‘ఆప్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది గమనించే ఆప్ ఎమ్మెల్యేలు సహా లీడర్లు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఓటమి తప్పదని గ్రహించిన ఆప్.. ఢిల్లీ ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తున్నది. కానీ అవన్నీ ప్రజలకు తెలుసు.. ఈసారి బీజేపీనే గెలిపించాలని వాళ్లు డిసైడ్ అయ్యారు” అని చెప్పారు.
ఆదివారం ఢిల్లీలోని ఆర్కేపురంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఆప్ అసత్యాలు ప్రచారం చేస్తున్నది. మేం అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఒక్క మురికివాడను కూడా కూల్చం. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపం” అని తెలిపారు. ఢిల్లీలో ఉంటున్న పూర్వాంచల్, బిహార్ వాసులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తానూ పూర్వాంచల్ రీజియన్‌లోని (వారణాసి) ఎంపీనే అని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్లో బిహార్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
మహిళా ఓటర్లే నాకు రక్ష..
మహిళా ఓటర్లే తనకు రక్ష అని మోదీ అన్నారు. వాళ్ల వల్లనే తాను పొలిటికల్‌గా సక్సెస్ అయ్యానని చెప్పారు. ‘‘తల్లులు, అక్కాచెల్లెళ్లు, బిడ్డలు.. నాకు రక్షణ కవచాలు. నేను మూడోసారి దేశాన్ని పాలిస్తున్నానంటే.. దానికి కారణం వాళ్లే. అందుకే నేను ఇచ్చే ప్రతి హామీ.. మహిళా ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఉంటుంది” అని తెలిపారు.
‘‘మీరందరూ రాసిపెట్టుకోండి.. ఫిబ్రవరి 8న ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) నాటికి మహిళల ఖాతాల్లో నెలకు రూ.2,500 జమ చేయడం ప్రారంభమవుతుంది’’ అని పేర్కొన్నారు. ఆప్ పాలనలో ప్రజలు అధిక ధరలతో సతమతమవుతున్నారని, ఆ పార్టీ పాలన నుంచి విముక్తి పొందాలని జనం డిసైడ్ అయ్యారని చెప్పారు.
ఇది మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ బడ్జెట్..
ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్.. మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని మోదీ అన్నారు. ‘‘మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ బడ్జెట్ తయారు చేశాం. మధ్యతరగతి ప్రజలు, నిజాయితీగా పన్ను కట్టేవాళ్లు అంటే మా పార్టీకి ఎంతో గౌరవ ఉంది. ఈ బడ్జెట్‌తో మిడిల్ క్లాస్ ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటాయి. వాళ్లకు కావాల్సిన వస్తువులు కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది” అని అన్నారు.
ఇండోనేసియాతో వేల ఏండ్ల బంధం..
ఇండోనేసియాతో ఇండియాకు వేల ఏండ్ల బంధం ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. జకార్తాలోని మురుగన్ ఆలయంలో ఆదివారం మహాకుంభాభిషేకం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ‘‘మహాకుంభాభిషేకంలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇండోనేషియాకు చాలా దూరంలో ఉన్నప్పటికీ, నా మనసంతా అక్కడే ఉంది. మహాకుంభాభిషేకం సందర్భంగా మురుగన్ భక్తులందరికీ శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అని మోదీ పేర్కొన్నారు.