ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముగ్గురు బాక్సింగ్ చాంపియన్ లు నిఖత్ జరీన్, మనీశా మౌన్, పర్వీన్ హుడా ఇంటరాక్ట్ అయ్యారు. ఈసందర్భంగా వారిని అభినందించిన మోడీ.. స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఇటీవల టర్కీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో ఎలా ఆడారనేది అడిగి తెలుసుకున్నారు.తమ కుటుంబ నేపథ్యం గురించి ఈసందర్భంగా బాక్సర్లు వివరించారు.మోడీతో వారి చిట్ చాట్ సాగిందిలా..
నిఖత్ జరీన్ : ఫైనల్ మ్యాచ్ లో నేను ఎంతో టెన్షన్ కు లోనయ్యాను. దేశమంతా నాపైనే ఆశలు పెట్టుకోవడంతో ఎంతో ఒత్తిడి గురయ్యాను. చివరకు మ్యాచ్ గెలిచిన తర్వాత.. రెఫరీ వచ్చి నా చెయ్యి పైకెత్తిన తర్వాత భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. నా ఇన్నేళ్ల కల సాకారమైంది. దేశం కోసం ‘వరల్డ్ చాంపియన్ షిప్’ టైటిల్ ను సాధించినందుకు గర్వంగా అనిపించింది.
మోడీ : మీరు ఎన్ని దేశాల వాళ్లను ఓడించారు నిఖత్ ?
నిఖత్ : ఐదు దేశాల ప్లేయర్లను ఓడించాను.
మోడీ : నిఖత్.. ఏ మ్యాచ్ లో ఎక్కువ ఒత్తిడికి లోనయ్యారు ?
నిఖత్ : అన్ని మ్యాచ్ ల కంటే.. ఫైనల్ లో ఎక్కువ ఒత్తిడికి లోనయ్యాను.
మోడీ : మిగతా క్రీడల్లో కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది. మీ బాక్సింగ్ లో ఎలాంటి సాంకేతికత వచ్చింది ?
నిఖత్ : స్కోరింగ్ మారింది. దానికి సంబంధించిన గణాంకాల్లో మార్పు జరిగింది.
#WATCH | PM Narendra Modi interacted with the women boxers Nikhat Zareen, Manisha Moun and Parveen Hooda who won medals in the World Boxing Championships
— ANI (@ANI) June 2, 2022
(Source: PMO) pic.twitter.com/ewVWTJeimx
మోడీ : మనీషా చెప్పండి. మీ అనుభవమేంటి ?
మనీషా : గాయం నుంచి కోలుకున్న తర్వాత నాకు ఇది పెద్ద చాలెంజ్ గా కనిపించింది. నేను ఇంకా ఎక్కువ శ్రమించాల్సిన అవసరముంది.
మోడీ : పర్వీన్ చెప్పండి..
పర్వీన్ హుడా : నేను తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఆడాను. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించే ప్రయత్నం చేశాను.
మోడీ : బయటి దేశాల క్రీడాకారులు పొందే శిక్షణకు, మన దేశంలో అందించే శిక్షణకు ఉన్న మౌలిక తేడా ఏంటని భావిస్తున్నారు ?
నిఖత్ : మన దేశంలో చాలా చక్కగా ఏడాదంతా శిక్షణ అందిస్తారు. డైట్ మెనూ కూడా చాలా చక్కగా ఉంటుంది. మరే దేశంలోనూ ఇలా ట్రైనింగ్ ఇవ్వరు.
మోడీ : నిఖత్ మీరు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. మీ నాన్నయితే ఇంతకుముందు సౌదీ లో ఉండేవారు. ఇప్పుడు మీ కోసం ఇక్కడే ఉంటున్నారు. మనీశా నీ గురించి చెప్పు ..
మనీశా : మా అక్క పెళ్లయింది. మా అన్న ఇంకా చదువుతున్నాడు.
మోడీ : పర్వీన్ నువ్వు చెప్పు..
పర్వీన్ : మా వ్యవసాయ పనులను అమ్మ చూస్తుంటుంది. మా ఇద్దరు అక్కా చెల్లెళ్లను ఆమె కష్టపడి చదివించింది.
మనీశా : మోదీ గారి ప్రారంభం కూడా చాయ్ తో అయింది. నా ప్రారంభం కూడా చాయ్ తోనే అవుతుంది. ఉదయం,సాయంత్రం, రాత్రి నేను చాయ్ తాగుతుంటాను.
మోడీ : హరియాణా ప్రజలకు ఒక విశిష్టత ఉంటుంది. వాళ్లు ఏదైనా విషయంపై జోక్ లు వేయగలరు.
మనీశా : మీ గుజరాతీ లో నాకు తెలిసింది ఒకే పదం.. అదే ‘కేంచో’(ఎలా ఉన్నారు ?)
మోడీ : కేంచో... మీరు ఎంజాయ్ చేస్తున్నారు
నిఖత్ : నేనొక షాయరీ రాసుకొచ్చాను. వినండి సార్.. (షాయరీ వినిపించిన నిఖత్)
మోడీ : షాయరీ చాలా బాగుంది.. మీ అందరికీ నా తరఫున హార్దిక శుభాకాంక్షలు
మరిన్ని వార్తలు..