ఇది అసాధారణ మ్యాచ్.. అసాధారణ ఫలితం: టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ఇది అసాధారణ మ్యాచ్.. అసాధారణ ఫలితం: టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు అభినందనలు. భారత్‎కు ఛాంపియన్స్ ట్రోఫీ అందించినందుకు గర్వంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆసాంతం భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఇది అసాధారణ మ్యాచ్.. అసాధారణ ఫలితం. టోర్నీలో ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించిన భారత జట్టుకు శుభాకాంక్షలు’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్‎కు శుభాకాంక్షలు తెలిపారు.  ‘‘ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. భారత జట్టుకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’’ అని ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. 

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా టీమిండియాకు అభివనందనలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‎లో టీమిండియా న్యూజిలాండ్‎పై ఘన విజయం సాధించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ అద్భుత ఆటతీరుతో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్‎గా భారత్ సత్తాను చాటి చెప్పిందన్నారు. భారత జట్టులోని ఆటగాళ్లందరికీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. 

ALSO READ | IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ మనదే.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025  విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‎తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. తుది సమరంలో కివీస్ పోటీ ఇచ్చినా భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగుల మోస్తారు స్కోర్ చేసింది. 

లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి విజయం సాధించింది. భారత విజయంలో రోహిత్ శర్మ (76: 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు. ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అంతకముందు 2013 లో ధోనీ కెప్టెన్సీలో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది.