![వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేశారు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్](https://static.v6velugu.com/uploads/2025/02/prime-minister-modi-fire-on-congress_D7Fa5cCIeA.jpg)
న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్‌పార్టీ ప్రజల వాక్స్వాతంత్ర్యాన్ని అణచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. దేవ్ఆనంద్సహా పలువురు నటులు, కళాకారులపై నిషేధం విధించిందని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే భావన కాంగ్రెస్‌కు అర్థం కాదని చురకలంటించారు.
‘మేం పదేండ్ల నుంచి సుపరిపాలన అందిస్తున్నాం. పేదల అభ్యున్నతి కోసమే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నం. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు సాగుతున్నాం.. దీనిని కాంగ్రెస్ నుంచి ఆశించడం పెద్ద తప్పే అవుతుంది. ఎందుకంటే ఈ భావన వారి ఆలోచన పరిధిని దాటి ఉంటుంది. ఆ పార్టీ మొత్తం ఒక కుటుంబానికే అంకితం” అని ఎద్దేవా చేశారు.
నేషన్ ఫస్ట్ మా నినాదం
‘ఫ్యామిలీ ఫస్ట్’ అనేది కాంగ్రెస్ నినాదమైతే.. ‘నేషన్ఫస్ట్’ అనేది తమ స్లోగన్ అని మోదీ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో బుజ్జగింపు రాజకీయాలు ఉండేవని అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశం కొత్త వర్కింగ్ స్టైల్‌ను చూసిందని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలు కాకుండా.. సంతృప్తికర పాలన అందించామని తెలిపారు. దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. విద్యారంగం అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వ పథకాలన్నీ ఉంటున్నాయని తెలిపారు. తమ అభివృద్ధి మోడల్‌ను ప్రజలు అర్థం చేసుకొని, మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలు, మహిళలు, ట్రాన్స్జెండర్ల అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు చెప్పారు.
అంబేద్కర్‌ను కాంగ్రెస్ ద్వేషించింది
రాజ్యాంగ నిర్మాత, దళిత నేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయనను ఆ పార్టీ ద్వేషించిందని చెప్పారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించిందని మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఆ పార్టీకి జై భీమ్ అనాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ముంబైలో కార్మికుల నిరసన సందర్భంగా ప్రముఖ కవి సుల్తాన్‌పురి కవిత చదివితే.. ఆయన్ను జైల్లో పెట్టారని గుర్తుచేశారు. కార్మికుల ఆందోళనలో పాల్గొన్నందుకు నటుడు బల్రాజ్సాహ్నీని కూడా జైలుకు పంపించారని పేర్కొన్నారు.
సమాజంలో కుల విషాన్ని నింపుతున్నది
ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ సమాజంలో విభజన, ఆందోళన, కుల విషాన్ని నింపుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. చాలా ఏండ్లుగా ఓబీసీ వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఓబీసీ ప్యానెల్‌కు రాజ్యాంగ హోదా కోరుతుంటే.. మైనార్టీలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని అన్నారు. రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా దేశంలో చీలికలు తెచ్చేందుకు కాంగ్రెస్ యత్నించిందని మండిపడ్డారు. ‘‘మొదటిసారి మేం ఓ మోడల్‌ను అందించాం. ఎవరినుంచీ లాక్కోకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10% రిజర్వేషన్ కల్పించాం. దీన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు స్వాగతించాయి. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు” అని మోదీ పేర్కొన్నారు.