దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం.. కాంగ్రెస్‎పై నిప్పులు చెరిగిన మోడీ

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం.. కాంగ్రెస్‎పై నిప్పులు చెరిగిన మోడీ

న్యూఢిల్లీ: లోక్ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య గొంతు నొక్కిందని.. భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చ అని అభవర్ణించారు. చాలాసార్లు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని చంపాలని ప్రయత్నించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1951లో భావ ప్రకటన స్వేచ్ఛపై కాంగ్రెస్ దాడి చేసిందని.. అధికారంలో లేనప్పుడు దొంగచాటుగా ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు. 

ప్రజల అనుమతి లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిందని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ నిర్వహించారు. లోక్ సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చకు శనివారం (డిసెంబర్ 14)  ప్రధాని మోడీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ.. భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశంలో సొంత రాజ్యాంగాన్ని నడిపారని.. కాంగ్రెస్ నేతలు అంబేద్కర్‎ను అవమానించారని నిప్పులు చెరిగారు. 

కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని నెహ్రూ దొంగచాటుగా రాజ్యాంగాన్ని సవరించారని ఆరోపణలు గుప్పించారు. నెహ్రూ తప్పులను ఆయన కూతురు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కొనసాగించారని అన్నారు. ప్రధాని పీఠం కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిందని.. ఎమర్జెన్సీ సమయంలో వేలాది మందిని అన్యాయంగా జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలు, న్యాయస్థానాల గొంతు నొక్కారని.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అధికారాలు తగ్గించేందుకు కూడా 1971లో ఇందిరా ప్రయత్నించారని ఆరోపించారు.  

ALSO READ | త్వరలోనే ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా భారత్: ప్రధాని మోడీ

కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో 75 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని తెలిపారు. నెహ్రూ కుటుంబం ఈ దేశానికి అన్ని విధాలుగా నష్టం చేసిందని.. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు శత విధాల ప్రయత్నించిందని ఆరోపించారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్.. ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీశారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మేం కూడా సవరించాం.. అది పేద ప్రజలు, మహిళలకు మేలు చేసేందుకు అని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేసి మహిళా రిజర్వేషన్లు తెచ్చాం.. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు.