- లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై ప్రధాని మోదీ ఫైర్
- సింపతీ కోసమే సభలో డ్రామాలాడుతున్నరు
- అగ్నిపథ్, ఎంఎస్పీపై అబద్ధాలు చెప్తున్నరు
- దేశంలో హిందువులకు వ్యతిరేకంగా కుట్ర
- థర్డ్ టర్మ్‌లో మూడు రెట్లు స్పీడ్‌గా పని చేస్తం
- మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543
- కాంగ్రెస్ పారాసైట్ పార్టీ.. జులై 1 ఖటాఖట్ దివస్ అని ఎద్దేవా
- ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పిల్ల చేష్టలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. చేసిన తప్పులు చెప్పుకోకుండా పిల్లలు సింపతీ కోసం ఏడిచినట్టుగా రాహుల్ చైల్డిష్ బిహేవియర్‌తో వ్యవహరిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి దేశ ప్రజలు వరుసగా మూడోసారి అధికారాన్ని అప్పగించారని, అయినా ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఎన్నికల్లో తామే గెలిచామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.
పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై రెండు రోజుల చర్చకు సోమవారం లోక్ సభలో ప్రధాని సమాధానం ఇచ్చారు. ‘‘కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు 100 సీట్లు కూడా దాటకపోవడం ఇదే ఫస్ట్ టైం. ఓటమిని ఒప్పుకోవాల్సిన ఆ పార్టీ అహంకారంతో వ్యవహరిస్తోంది. వాళ్లు మమ్మల్ని ఓడించారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు” అని మోదీ చెప్పారు.
‘‘99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కు వచ్చింది 100కు 99 సీట్లు కాదు.. 543కు 99 సీట్లే వచ్చాయి. వారి స్ట్రైక్ రేట్ 26% మాత్రమే. ప్రజా తీర్పును ఇకనైనా గౌరవించాలి”అని మోదీ చురకలు వేశారు. సింపతీ కోసమే ప్రతిపక్షాలు లోక్ సభలో కొత్త డ్రామాకు తెర లేపాయన్నారు. దేశంలో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించే దిశగా కాంగ్రెస్ పని చేస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘రూ. వేల కోట్ల మోసాలకు పాల్పడి, బెయిల్ పై బయటకు రావడంతోపాటు ఓబీసీలను దొంగలు అని పిలిచిన కేసులో దోషిగా తేలామన్న నిజం వాళ్లకు తెలుసు. దేశ అత్యున్నత కోర్టుపై బాధ్యతారహితమైన కామెంట్లు చేసినందుకు వాళ్లు క్షమాపణలు చెప్పాలి” అని రాహుల్ పై మోదీ మండిపడ్డారు.
అగ్నిపథ్, ఎంఎస్పీపై అబద్ధాలు చెప్తున్నరు..
అగ్నిపథ్ స్కీం, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) అంశాలపై ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మోదీ ఆరోపించారు. ‘‘అగ్నిపథ్ స్కీం, ఎంఎస్పీపై అబద్ధాలు చెప్పారు. దేశం సంక్షోభంలోకి వెళ్తోందని ప్రచారం చేసేందుకు ఆయన (రాహుల్) వంటి సీజనల్ లీడర్లు ఇలాంటి అరాచక మార్గాన్ని ఎన్నుకున్నారు” అని ప్రధాని విమర్శించారు.
‘‘స్పీకర్ సర్.. మీరు అన్నింటినీ ఓపికగా నవ్వుతూ భరిస్తారు. కానీ సోమవారం ఇక్కడ ఏం జరిగిందో అది పార్లమెంట్ కు మంచిది కాదు. అవి పిల్ల చేష్టలు అని విస్మరించడం సరికాదు” అని సూచించారు. గత పదేండ్లుగా తమ పనితీరును చూసి మెచ్చుకున్నందుకే దేశ ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని మోదీ చెప్పారు. థర్డ్ టర్మ్ లో తాము మూడు రెట్లు స్పీడ్ గా, మూడు రెట్ల బలంతో పని చేస్తామని, మూడు రెట్ల ఫలితాలను కూడా సాధిస్తామన్నారు.
కాంగ్రెస్ ‘ప్యారాసైట్’ పార్టీ
మిత్రపక్షాల ఓట్లతో ప్రయోజనం పొందుతూ కాంగ్రెస్ పరాన్నజీవ (ప్యారాసైట్) పార్టీగా మారుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. 2024 నుంచి ఇక ఆ పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ప్యారాసైట్ కాంగ్రెస్ గా పేరు పొందుతుందన్నారు. అలాగే రాహుల్ గాంధీకి ఆయన లిమిట్స్ ఏమిటో ఆయనకు తెలియవన్నారు. సోమవారం లోక్ సభలో ఒకప్పటి తన సహచర నేత అయిన జ్యోతిరాదిత్య సింధియాను చూసి రాహుల్ గాంధీ కన్ను గీటడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘దేశం జులై 1న ఖటాఖట్ దివస్ ను చూసింది.
ఆయన నేడు ఇక్కడ ఉండటం చూసి దేశం విచారం వ్యక్తం చేస్తోంది. ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో రూ. 8,500 పడ్డాయేమోనని అకౌంట్లు చెక్ చేసుకుంటున్నారు” అని మోదీ విమర్శించారు. బీజేపీ ప్రత్యర్థులు ప్రతిపక్షంలో ఉండాలని, వాదనలు కొనసాగించలేక అరుచుకుంటూ కూర్చోవాలని ప్రజలు తీర్పు చెప్పారని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల తీర్పును అర్థం చేసుకుని, అంగీకరించాలని నేను కాంగ్రెస్ ను కోరుతున్నా. అంతేతప్ప ఫేక్ విక్టరీ సెలబ్రేషన్స్ చాటుకు దాక్కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా” అని సూచించారు. ‘‘అబద్ధాలు వ్యాప్తి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించినా లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని కొందరు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. కాంగ్రెస్ ఓటమిని అంగీకరించి ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆ పార్టీ శీర్షాసనం వేయడంలో బిజీగా ఉంది” అని మోదీ ఎద్దేవా చేశారు.
హిందువులకు వ్యతిరేకంగా కుట్ర..
దేశంలో హిందువులకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ, కుట్రకు పాల్పడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం సభలో రాహుల్ గాంధీ చేసిన మతపరమైన కామెంట్లపై ఆయన ఘాటుగా స్పందించారు. “నేడు హిందువులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. వీళ్లు హిందూ టెర్రరిజం అనే పదాన్ని కాయిన్ చేయాలని ప్రయత్నించిన వ్యక్తులు.
వీరి అనుచరులు హిందూయిజాన్ని డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ఈ దేశం వీళ్లను ఎన్నటికీ క్షమించదు. హిందూ సంప్రదాయాలను ఎగతాళి చేయడం, అవమానించడం, తక్కువ చేసి చూపడం కోసం వారి వ్యవస్థ మొత్తం కుట్ర పన్నుతోంది” అని అన్నారు. ‘‘ఇదే మీ కల్చర్. ఇదే మీ క్యారెక్టర్. ఇదే మీ ఆలోచన. ఇదే మీ ద్వేషం. ఇవన్నీ ఈ దేశంలో హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు. వీటిని ఈ దేశం కొన్ని శతాబ్దాలు గడిచినా మరిచిపోదు” అని ప్రధాని ఫైర్ అయ్యారు. సోమవారం జరిగిన దానిని సీరియస్ గా తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.
దద్దరిల్లిన లోక్ సభ
ప్రధాని మాట్లాడేందుకు ముందు మణిపూర్ ఎంపీలు సభలో మాట్లాడేందుకు అనుమతించాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే, మణిపూర్ అంశంపై అక్కడి ఎంపీ సోమవారమే సభలో మాట్లాడారని స్పీకర్ స్పష్టంచేశారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. అనంతరం మోదీ స్పీచ్ కొనసాగుతుండగా ప్రతిపక్ష సభ్యులు సభ దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ, బల్లలు చరుస్తూ నిరసనలతో హోరెత్తించారు.
‘నియంతృత్వం చెల్లదు’, ‘జస్టిస్ ఫర్ మణిపూర్’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. ‘‘నిన్న మీకు 90 నిమిషాలు మాట్లాడే సమయం ఇచ్చాను. అప్పుడు ఎవరూ మిమ్మల్ని ఆపలేదు. సభలో ఇలా ప్రవర్తించడం సరికాదు. ఐదేండ్లు ఇలాగే చేస్తూ పోతామంటే కుదరదు” అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ పై స్పీకర్ సీరియస్ అయ్యారు.