పట్టాలెక్కిన వందే భారత్​ మెట్రో

పట్టాలెక్కిన వందే భారత్​ మెట్రో
  • అహ్మదాబాద్​లో ప్రారంభించిన ప్రధాని మోదీ
  • పలు వందే భారత్​ రైళ్లకు పచ్చ జెండా

అహ్మదాబాద్: దేశంలోనే తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలెక్కింది. నమో ర్యాపిడ్​ రైల్​గా నామకరణం చేసిన ఈ మెట్రో రైలును గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ప్రధాని మోదీ సోమవారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  అలాగే, నాగ్​పూర్​–సికింద్రాబాద్, కొల్హాపూర్​–పుణె, ఆగ్రాక్యాంట్–వారణాసి, దుర్గ్​–విశాఖపట్నం, పుణె–హుబ్బళి, విశాఖపట్నం–రాయ్​పూర్​మధ్య నడిచే వందే భారత్​రైళ్లకు వర్చువల్​ విధానంలో గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు.

అహ్మదాబాద్​లో రూ.8 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.  అనంతరం మెట్రోలో గాంధీనగర్​సెక్టార్​–1 స్టేషన్​నుంచి గిఫ్ట్​సిటీ వరకు మోదీ ప్రయాణించారు. 

ప్రతిపక్షాలు నన్ను ఎగతాళి చేసినా  మౌనంగా ఉన్నా

మూడోసారి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో ప్రతిపక్షాలు తనను ఎగతాళి చేశాయని, అయితే, వారి అవమానాలకు స్పందించకూడదని తాను నిర్ణయించుకున్నట్టు ప్రధాని మోదీ అన్నారు. ఈ వంద రోజుల్లో తమ ప్రభుత్వ ప్రణాళికను పూర్తిచేయడంపైనే తాను దృష్టిపెట్టానని చెప్పారు. తన మౌనాన్ని చూసి ప్రజలే ఆశ్చర్యపోయారని అన్నారు.

దేశ ప్రజలకోసం తన జీవితాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘‘నేను బతికితే మీ కోసమే బతుకుతాను. కష్టపడితే మీ కోసమే కష్టపడతాను. ఒకవేళ ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినా.. అది మీకోసమే చేస్తాను” అని ప్రజలనుద్దేశించి అన్నారు.  

 21 వ శతాబ్దంలో మన దేశమే బెస్ట్​

 ప్రపంచ దేశాల సమస్యలకు భారత్ పరిష్కారంగా మారుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అన్ని రంగాల్లోనూ భారతే బెటర్ ​అని దేశ పౌరులతో పాటు యావత్​ ప్రపంచం భావిస్తున్నదని చెప్పారు.

గాంధీనగర్​లో గ్లోబల్ ​రెన్యూవెబుల్​ ఎనర్జీ ఇన్వెస్టర్స్ ​మీట్​అండ్​ ఎక్స్​పో–2024 (రీఇన్వెస్ట్​–2024)ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో దేశ పురోగతికోసం ప్రతి రంగానికి ప్రాధాన్యతనిచ్చామని చెప్పారు. 

నమో భారత్​ ర్యాపిడ్ రైల్​​ ప్రత్యేకతలివే..

రైల్వే శాఖ తొలిసారిగా ఈ వందే భారత్​ మెట్రో రైలును ప్రవేశపెట్టింది. ప్రారంభానికి ముందే దీనికి నమో భారత్​ ర్యాపిడ్​ రైలుగా పేరుపెట్టారు. ఇది గుజరాత్​లోని కచ్​ జిల్లాలో ఉన్న భుజ్​ను రాష్ట్రంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన అహ్మదాబాద్​తో కలుపుతుంది. కేవలం 6 గంటల్లో 360 కిలోమీటర్ల దూరాన్ని కవర్​ చేస్తుంది. ఈ రెండు నగరాల మధ్య టికెట్​ ధర రూ.455గా నిర్ణయించారు.

ఈ మెట్రో రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మార్గమధ్యలో అంజర్​, గాంధీధామ్​, భచౌ, సమాఖియాలీ, హల్వాడ్​, ధృంగాధ్ర, విరామ్​గామ్​, చంద్లోడియా, సబర్మతి స్టేషన్లలో ఆగుతుంది. వారంలో ఆరు రోజులు ఈ సర్వీస్​ సేవలు అందుబాటులో ఉంటాయి.

 ఇందులో 2,058 మంది ప్రయాణించొచ్చు. 1,150 మందికి సీటింగ్​ సదుపాయం ఉంది. అన్ని కోచ్​లలో ఏసీ ఉంటుంది. వందే భారత్​ తరహాలో కనిపించినా.. రెండు చివరల్లో ఆటోమేటిక్​ స్టైడింగ్​ డోర్లు, ఇంజిన్స్​తో ఉంటుంది.