- నేరుగా రంగంలోకి ప్రధాని మోడీ
- రాష్ట్ర పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా
- ఇందులో భాగంగానే బేగంపేటలో సడన్ మీటింగ్
- ఆయన డైరెక్షన్‌తోనే జాతీయ కార్యవర్గ వేదికగా హైదరాబాద్ ఎంపిక
- రెండు రోజులు ఇక్కడే ఉండనున్న ప్రధాని
- రాష్ట్రంలో మరో భారీ బహిరంగ సభ
- అన్నింటిపైనా మోడీ మార్క్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలన్న నిర్ణయం వెనుక కూడా ప్రధాని మోడీ ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఈ సమావేశాల సందర్భంగా రెండు రోజులు మోడీతోపాటు పార్టీ జాతీయ ప్రముఖులందరూ ఇక్కడే ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలపై లోతుగా సమీక్ష జరిపే అవకాశముందని పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఈ మూడు నెలల్లో ప్రధాని మోడీ రెండు సార్లు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మోడీకి కలిగిందని, అందుకే రాష్ట్రంపై పీఎంవో ప్రత్యేక దృష్టి సారించిందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను బీజేపీలోకి ఆహ్వానించే విషయంలో కూడా మోడీనే చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపడంలోనూ పీఎంవో కీలకమని అంటున్నాయి. తెలంగాణలో పాలనాపరంగా, రాజకీయ పరంగా ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు పీఎంవో ప్రత్యేక నిఘా ఉంచిందని, వేగులను రంగంలోకి దింపిందనే చర్చ సాగుతోంది.
హైదరాబాద్ : తెలంగాణపై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నది. స్వయంగా పరిశీలిస్తున్నది. పాలనాపరమైన విషయాలే కాదు.. బీజేపీకి సంబంధించిన వ్యవహారాలను కూడా ఢిల్లీ నుంచే పర్యవేక్షిస్తున్నది. రాష్ట్ర రాజకీయాలపై నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టడంతో కొద్ది రోజులుగా పీఎంవో యాక్టివ్‌గా పని చేస్తున్నది. రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న సంఘటనను, రాజకీయ వ్యవహారాలను ఏ రోజుకారోజు మోడీ దృష్టికి చేరవేస్తున్నది. అందుకే పార్టీకి సంబంధం లేకుండా నేరుగా పీఎంవో డైరెక్షన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రంలో పర్యటించారు. వచ్చే నెలలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ మీటింగ్ ఎక్కడ నిర్వహించాలనే చర్చ జరిగినప్పుడు పార్టీ నేతలు వివిధ రాష్ట్రాల పేర్లు సూచించినప్పటికీ.. హైదరాబాద్ వేదికను స్వయంగా మోడీనే ఎంపిక చేసినట్లు తెలిసింది. తెలంగాణపై ప్రధాని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. ఆయన డైరెక్షన్‌లోనే ప్లానింగ్ జరుగుతున్నదని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది. మోడీ సూచనలకను గుణంగా ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి.
అంతా గమనించి.. నేరుగా రంగంలోకి :-
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులపై 3 నెలలుగా ఎక్కడపడితే అక్కడ సీఎం కేసీఆర్ నోరు పారేసుకున్నారు. దేశం నుంచి తరిమికొట్టాలంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామంటూ వరుసగా వివిధ రాష్ట్రాలకు చక్కర్లు కొట్టారు. అక్కడి సీఎంలతో భేటీ కావటంతోపాటు బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని రాజకీయ వేడి పెంచారు. గతంలో ఎన్నడూ లేని వడ్ల కొనుగోలు సమస్యను లేవనెత్తి ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడకుండా.. ప్రతిచోట కేంద్రాన్ని నిందించేందుకు టీఆర్ఎస్ ఎంచుకున్న రాజకీయ ఎత్తుగడను నిశితంగా గమనించిన పీఎంవో.. వరుసగా ఈ రిపోర్టులన్నీ మోడీకి చేరవేసింది. గవర్నర్ తమిళిసై కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఇక్కడి పరిస్థితులపై ప్రధానికి నివేదికలు ఇచ్చారు. కనీసం ప్రొటోకాల్ పాటించకుండా మహిళా గవర్నర్‌ను అ వమానిస్తున్న విషయాన్నీ కేంద్రం సీరియస్‌గానే తీసుకున్నట్లు సమాచారం. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిన కేసీఆర్.. వరుసగా డుమ్మా కొట్టడం జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకున్నందుకే తెలంగాణపై ప్రధాని ఫోకస్ పెట్టారని.. అందుకే పీఎంవోను యాక్టివ్ చేశారని తెలుస్తోంది.
రాష్ట్ర సర్కారు కంటే ముందే స్పందించి :-
నిజానికి ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో.. బీజేపీకి సంబంధించిన కార్యక్ర మంలో పాల్గొంటే రాష్ట్ర శాఖనే పీఎం స్పీచ్‌ను రెడీ చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర శాఖకు సంబంధం లేకుండా మోడీ ఇక్కడి పరిస్థితులపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పలు చోట్ల మోడీ నేరుగా పార్టీ నేతలను కలవడం, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను పలకరించటం ఆసక్తి రేపింది. అంతకుముందు నుంచే పీఎంవో ఇక్కడి సంఘటనలపై కూడా ఫోకస్ పెట్టింది. గత నెల 9న కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది చనిపోతే సీఎం కేసీఆర్ కన్నా ముందే పీఎం మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని పీఎం కేర్స్ నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాని కన్నా ముందే ప్రధాని చేసిన సంతాప ప్రకటన తెలంగాణ ప్రజలను
ఆశ్చర్యానికి గురి చేసింది.
బేగంపేట స్పీచ్.. అనూహ్యం :-
ఇటీవల ఐఎస్‌బీ కాన్వొకేషన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు ప్రధాని వచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణుల స్వాగత సభలో అనూహ్యంగా 25 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి మోడీ షెడ్యూల్‌లో బేగంపేట మీటింగ్ లేదు. అక్కడ పొలిటికల్ మీటింగ్ ఉంటుందనే విషయాన్ని పీఎంవో చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచింది. రాత్రికి రాత్రి పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు మాత్రమే సమాచారం అందించి.. సడన్‌గా పీఎం స్పీచ్‌కు ఏర్పాట్లు చేసింది. ఇదంతా పీఎంవో నేరుగా పర్యవేక్షించింది. ఇందులో సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ మోడీ మాట్లాడిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపికైంది. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఎంతో ధైర్యంతో పోరాడుతున్నారని, ఇక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయమని కార్యకర్తల్లో ఆయన జోష్ నింపారు.