డ్రోన్ రంగంలో  భారీగా ఉపాధి అవకాశాలు

న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో డ్రోన్ రంగం అతిపెద్దదిగా అవతరించి.. భారీగా ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీని ఓ సమస్యగా గత ప్రభుత్వాలు చూడడం జరిగిందని, 2014కు ముందు ఈ విషయంలో ఉదాసీనత చూపారని విమర్శించారు. భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022 ప్రధాని మోదీ ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ డ్రోన్ మహోత్సవ్ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదలు, మధ్య తరగతి వాళ్లు చాలా సమస్యలను ఎదుర్కొన్నట్లు.. దేశ సాగు రంగాన్ని స్మార్ట్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కిస్తుందన్నారు. 2026 నాటికి డ్రోన్ పరిశ్రమ రూ. 15 వేల కోట్లకు చేరుకుంటుందని, దేశంలో 270 డ్రోన్ స్టార్టప్ లున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కిసాన్ డ్రోన్ పైలట్ లతో చర్చలు, డ్రోన్ ప్రదర్శనలు, ఎగ్జబిషన్ సెంటర్ లోని స్టార్టప్ లతో ప్రధాని సంభాషించారు. మే 27వ తేదీ ఉదయం 10 గంటలకు భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022లో పాల్గొంటానని, ఈ ఫోరమ్ రంగంలో స్టార్టప్ లతో సహా కీలకమైన వాటాదారులను ఒక చోట చేర్చిందని ప్రధాని మోదీ ట్వీట్ లో తెలిపారు.

సాంకేతికత, ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్న వారందరూ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, విదేశీ దౌత్యవేత్తలు, సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్, డ్రోన్ స్టార్టప్ లు.. మొత్తం 1600 మంది ప్రతినిధులు డ్రోన్ ఫెస్టివల్ లో పాల్గొంటారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఎగ్జిబిషన్ లో 70 మందికి పైగా ఎగ్జిబిటర్లు డ్రోన్లను ప్రదర్శిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించింది. డ్రోన్ పైలట్ సర్టిఫికేట్లు, ప్రొడక్ట్ లాంచ్, ప్యానెల్ చర్చలు, ప్రదర్శనలుంటాయి. వ్యవసాయ రంగంతో పాటు వివిధ రంగాల్లో డ్రోన్ లను విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ నెల ప్రారంభంలో.. నీతి ఆయోగ్ లో స్టేట్ రన్ థింక్ ట్యాంక్ ను విడుదల చేశారు. కిసాన్ డ్రోన్ కోసం రైతులు, సంస్థలకు వివిధ ప్రోత్సాహకాలు అందించింది ప్రభుత్వం. డ్రోన్ పైలట్ శిక్షణా కోర్సుల ఫీజులు భవిష్యత్ లో గణనీయంగా తగ్గుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి సింథియా.