అమెరికాకు ప్రధాని మోదీ : సెప్టెంబర్ 23 వరకు పర్యటన

అమెరికాకు ప్రధాని మోదీ : సెప్టెంబర్ 23 వరకు పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శనివారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ నెల 23వ తేదీ వరకు మూడు రోజులపాటు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్ స్వస్థలమైన డెలావేర్​లోని విల్మింగ్టన్​లో జరగనున్న క్వాడ్​ లీడర్స్​​నాలుగో శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొననున్నారు.  ఈ సమిట్​కు జో బైడెన్ ఆతిథ్యం ఇస్తున్నారు. అలాగే, ఈ సదస్సు వేదికగానే జోబైడెన్​తోపాటు ఇతర ప్రపంచ నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 

క్వాడ్​ సమిట్​లో ఇండో పసిఫిక్ ​రీజియన్​లో సహకారాన్ని పెంపొందించడం, రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–హమాస్​ యుద్ధాలకు పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. అలాగే, క్యాన్సర్​ గుర్తింపు, చికిత్స, నివారణ, రోగులు, వారి కుటుంబ సభ్యులపై  ప్రభావాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆవిష్కరణలను సెట్​ చేస్తారు. ఇండో–పసిఫిక్​లో శాంతి, పురోగతి, స్థిరత్వంపై దృష్టిసారిస్తారని, ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మౌలిక, సదుపాయ రంగాల్లో సహకారం, కనెక్టివిటీ, కౌంటర్ ​టెర్రరిజంపై నేతలు చర్చిస్తారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ ​మిస్రీ తెలిపారు. 

కాగా, ఆదివారం లాంగ్​ఐలాండ్​లో ప్రవాస భారతీయులతో మోదీ భేటీ అవుతారు.  ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్​లాంటి అధునాతన సాంకేతికతలపై పనిచేస్తున్న అమెరికా సంస్థల సీఈవోలతో రౌండ్​​టేబుల్​ సమావేశంలో పాల్గొంటారు.  చివరిరోజు న్యూయార్క్​లోని యునైటెడ్​ నేషన్స్​ జనరల్​ అసెంబ్లీలో ‘సమిట్​ఆఫ్ ​ద ఫ్యూచర్​’ సదస్సులో మోదీ ప్రసంగిస్తారు.  ‘మెరుగైన భవిష్యత్తు కోసం అనుకూల పరిష్కారాలు’ అనే అంశంపై మాట్లాడుతారు.

క్వాడ్​ కీలక వేదిక: మోదీ

ఇండో–పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సుపై దృష్టిసారించే భావజాలం కలిగిన దేశాలకు క్వాడ్​కీలక వేదిక అని ప్రధాని మోదీ తెలిపారు. శనివారం అమెరికా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మోదీ ట్విట్టర్​లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘నా సహచరులు అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, జపాన్ ​ప్రధాని కిషిడతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నా” అని పేర్కొన్నారు. ఈ సమావేశం దేశ, ప్రపంచ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అని తెలిపారు. 

భారత్​–యూఎస్​ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతానికి కొత్త మార్గాలను సమీక్షించేందుకు, గుర్తించేందుకు బైడెన్​తో సమావేశం తోడ్పడుతుందని చెప్పారు. ‘‘ ప్రపంచంలోని అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాల మధ్య విశిష్ట భాగస్వామ్యానికి చైతన్యం తీసుకురావడంలో కీలక వాటాదారులుగా ఉన్న ప్రవాస భారతీయులు, ముఖ్యమైన అమెరికా బిజినెస్​ లీడర్లతో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నా” అని మోదీ వెల్లడించారు.