మేకిన్ ఇండియా మూలాలు 77లో!

ప్రధాని మోడీ ‘మేకిన్ ఇండియా’ మూలాలు ఈనాటివి కావు. ఈ ఆలోచనలు 40 ఏళ్ల క్రితమే మొలకెత్తాయి. 1977లో కోకా కోలాను ఇండియా నుంచి పంపించేసి మనకంటూ ఓ కూల్​డ్రింక్​ను తయారుచేశారు. ఈ జనతా కూల్​డ్రింక్​ జనానికి ఎక్కలేదు. ప్రొడక్ట్​ అనుకున్న స్థాయిలో సక్సెస్​ కాకపోయినా కొత్త విషయాలను నేర్పించింది.

ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడ్డ జనతా పార్టీ ప్రభుత్వం ‘మేకిన్​ ఇండియా’ దిశగా ఆలోచనలు, అడుగులు సాగించింది. ఇందులో భాగంగా ఫారిన్​ కూల్​ డ్రింక్​ కంపెనీ కోకా కోలాను మన దేశం నుంచి సాగనంపింది. దాని ప్లేసులో కొత్తగా ఓ కోలాను తయారు చేసి దానికి ‘డబుల్​ సెవెన్​ (77)’ అనే పేరు పెట్టింది. 1977లో జనతా పార్టీ (మొరార్జీ దేశాయ్​ ప్రధానిగా) సర్కార్​​ను ఏర్పాటు చేసింది. దీనికి గుర్తుగా ఈ బ్రాండ్​ నేమ్​ను ‘డబుల్​ సెవెన్​’గా ఫైనల్​ చేశారు. ఈ పేరును సూచించిన ఓ ఎంపీకి రూ.10,000 క్యాష్​ ప్రైజ్​ కూడా ఇచ్చారు.   ఈ ప్రొడక్ట్​ను తయారుచేయటంతోపాటు మార్కెటింగ్​ చేసే బాధ్యతలను ప్రభుత్వ సంస్థ మోడ్రన్​ ఫుడ్​ ఇండస్ట్రీస్​కి అప్పగించారు. విదేశీ కూల్​ డ్రింక్​కి బదులు లోకల్​ కోలాను డెవలప్​ చేయటం, ఉద్యోగాలు కోల్పోయిన కోకా కోలా వర్కర్లకు ఉపాధి కల్పించటం కోసం ఒక ప్లాన్​ రెడీ చేశారు. కోకాకోలా కలర్​లోనే, అదే మాదిరి​ సీనాతో రుచికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదంతా అప్పటి ఇండస్ట్రీస్​ మినిస్టర్​ జార్జ్​ ఫెర్నాండెజ్​ ఆధ్వర్యంలో జరిగింది. కోకా కోలా మాదిరిగానే ఈ డబుల్​ సెవెన్​ డ్రింక్​ను​ మనోళ్లు ఆదరిస్తారని భావించారు. కానీ ఏదో అనుకుంటే మరేదో అయింది.

ఆ రోజుల్లోనే రూ.100 కోట్ల సంస్థ

అప్పట్లోనే మన దేశంలో కోకా కోలా కంపెనీ విలువ​ రూ.100 కోట్లు. ఆ సంస్థకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్​ నెట్​వర్క్​ ఉంది. ఇందులో 22 బాట్లింగ్​ ప్లాంట్లు, రెండు లక్షలకుపైగా రిటైల్​ ఔట్​లెట్లు ఉండేవి. మొరార్జీ ప్రభుత్వం ఎంతో ఉత్సాహంతో 1977 నవంబర్​ 13న ‘సతత్తర్ (77)’​ బ్రాండ్​ మార్కెటింగ్​ని ప్రారంభించింది. ఈ డ్రింక్​ని కోకా కోలాకి ఆల్టర్నేటివ్​​గా అదే టేస్ట్​, అదే కలర్​, అదే ఫ్లేవర్​తో కస్టమర్ల ముందుకి తెచ్చింది. ఆ సర్కారీ కోలాను జనం ఆదరించలేదు. అదే సమయంలో​ క్యాంపా కోలా, థమ్స్​ అప్​, డ్యూక్​ వంటి ఇతర డ్రింక్స్ కూడా ప్రైవేటు రంగంలో మార్కెట్​లోకి వచ్చాయి. వాటి నుంచి ఎదురైన పోటీని డబుల్​ సెవెన్​ తట్టుకోలేక వెనకబడిపోయింది.

జనం మెచ్చని జనతా డ్రింక్​

లోకల్​ కోలా డ్రింక్​ తొలి ఆరు నెలల్లో (1978 మార్చి 31కి) సుమారు రూ.3.87 లక్షల నష్టాలు మూట గట్టుకుంది. 1979లో జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. 1980లో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్​ పార్టీ మళ్లీ పవర్​లోకి రావడంతో  ‘77 బ్రాండ్​’ భవిష్యత్తు కూడా చరిత్రలో కలిసిపోయింది. 1990లో పి.వి.నరసింహారావు ఎకనామిక్​ రీఫార్మ్స్​, లిబరల్​ పాలసీ ప్రవేశపెట్టారు. 1993లో  కోకా కోలా ఇండియాలోకి పెద్ద ఎత్తున రీఎంట్రీ ఇచ్చి, తన ఫ్యాన్స్​ని మళ్లీ ఆకట్టుకోగలిగింది.  ఈ నేపథ్యంలో మోడీ సర్కారు తలపెట్టిన ‘మేకిన్​ ఇండియా’ సక్సెస్​ కావాలంటే మనం మన తెలివితేటలపైనే ఆధారపడాలనే నగ్నసత్యాన్ని తెలియజెప్పింది.

‘సీక్రెట్​’ చెప్పని కోకా కోలా 

కోకా కోలా కంపెనీ ఇండియా నుంచి అసలు ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందనేది కూడా ఆసక్తికరమే. యాంటీ ఎమర్జెన్సీ క్రుసేడర్​ మొరార్జీ దేశాయ్​ అధికారంలోకి వచ్చిన ఏడాదే (1977లో) కోకా కోలాపై గురి పెట్టింది.  కోకా కోలా ఎక్స్​పోర్ట్​ కార్పొరేషన్ (సీసీఈసీ) ఇక్కడ బిజినెస్​ కంటిన్యూ చేయాలంటే ​డ్రింక్​ తయారీలో వాడే ‘సీక్రెట్​ ఇన్​గ్రెడియెంట్​’ను వెల్లడించాలన్న కండిషన్​ పెట్టింది. అమెరికాలోని హెడ్​ క్వార్టర్స్​ నుంచి మూడు నెలలకొకసారి కోలా కాన్సట్రేషన్​ని ఇంపోర్ట్​ చేసుకొని ఇండియాలోని బాట్లింగ్​ యూనిట్లలో  సీసాల్లో నింపేది.  ఈ ప్రాసెస్​కోసం అన్ని అనుమతులను కాంగ్రెస్​ ప్రభుత్వమే సీసీఈసీకి మంజూరు చేసింది. మొరార్జీ సర్కార్ ​హయాంలో రెన్యువల్​కి చేసుకోవాల్సిన అవసరం ఆ కంపెనీకి ఏర్పడింది.

కోకా కోలా కంపెనీ అప్పటికే 20 ఏళ్ల నుంచి ఇండియాలో పాపులారిటీ సంపాదించింది. సాఫ్ట్​ డ్రింక్ టోటల్​ కాన్సట్రేషన్​లో​ ఇన్​గ్రెడియెంట్​ డోస్​ నాలుగు శాతం మాత్రమే. కోకా కోలాకి ప్రత్యేకమైన టేస్ట్​ రావటంలో ఈ సీక్రెట్​ సాస్​దే కీలక పాత్ర అంటుంటారు. మొరార్జీ హయాంలో ఆర్బీఐ రెండు కండిషన్లు పెట్టింది.

  1. సీసీఈసీలోని 60 శాతం ఈక్విటీ షేర్లను ఇండియన్స్​కు ట్రాన్స్​ఫర్​ చేయటం.
  2. ‘టెక్నికల్​ నోహౌ (కూల్​ డ్రింక్​ తయారీ మర్మం)’ని వంద శాతం ఇండియన్​ కంపెనీకి బదిలీ చేయటం.

ఈ రెండు షరతులకు కోకో కోలా ఒప్పుకోలేదు. ఇండస్ట్రీస్​ మినిస్ట్రీలో ఈ కేసును డీల్​ చేసిన ఆఫీసర్లు… కోకా కోలాని పంపేయడమే మంచిదనే ఇంప్రెషన్​ను సర్కార్​కి కలిగించినట్లు టాక్​. ఆ ఇంప్రెషన్​ తర్వాత తల్లకిందులైంది.