
కన్యాకుమారి : తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ చేపట్టిన ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 45 గంటల పాటు ఆయన ధ్యానం చేశారు. ఉదయం సముద్రం వద్ద సూర్యుడికి అర్ఘ్యం వదిలారు. ధ్యానం ముగిసిన తర్వాత తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి తిరువళ్లువర్ కు మోదీ నివాళులు అర్పించారు. వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే ఉన్న 133 అడుగుల తిరువళ్లువర్ విగ్రహం చెంతకు పడవలో చేరుకున్న ఆయన అక్కడ నివాళులర్పించిన అనంతరం తిరిగి ఒడ్డుకు వచ్చారు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే చోట వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించారు. ఇక్కడ 1892లో వివేకానంద ధ్యానం చేశారు. కాగా, మోదీ నిజంగా ధ్యానం చేయలేదని, ఆయన ఫొటో షూట్ కోసమే ధ్యానం చేస్తున్నట్టు నటించారని ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ విమర్శించారు.
ఇండియా కూటమిని జనం తిరస్కరించారు..
ఓటర్లను ఆకట్టుకోవడంలో ఇండియా కూటమి విఫలమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ కూటమి తిరోగమన రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ప్రజలు రికార్డు స్థాయిలో తరలివచ్చి ఎన్డీఏ కూటమికి ఓటేశారని చెప్పారు. శనివారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ చివరి విడత పూర్తయిన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘‘ఓటు హక్కును వినియోగించుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా భారత్.. నారీ శక్తి, యువశక్తికి నేను కృతజ్ఞతలు చెబుతున్నా. పోలింగ్ కేంద్రాలకు వీరు వేలాదిగా తరలివచ్చి ఓటేయడం ప్రోత్సాహకరమైన సంకేతం”అని ప్రధాని పేర్కొన్నారు.