
హైదరాబాద్‌సిటీ, వెలుగు: తెలంగాణలో ఆమోదించిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లోనూ ఆమోదించి, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. పార్లమెంట్లో బిల్లులను ఆమోదించకపోతే రైతు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం మాదిరిగా బీసీ రిజర్వేషన్ల ఉద్యమం చేపట్టి అమీ తుమీ తేల్చుకుంటామని తేల్చిచెప్పారు.
‘‘బీసీ బిల్లులను ఆమోదించడంతోపాటు త్వరలో చేపట్టబోయే జనగణనతో పాటే బీసీ కులగణన చేపట్టి ప్రధాని మోదీ బీసీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగే ‘బీసీల పోరుగర్జన’ మహాధర్నాకు సోమవారం చర్లపల్లి రైల్వే స్టేషన్నుంచి ప్రత్యేక రైలులో పలువురు బీసీ సంఘాల నేతలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ జెండా ఊపి రైలును ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంటులో ఆమోదించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. బీసీ సంఘాలన్నీ ఒకే వేదిక మీదికి వచ్చి ధర్నా చేపడ్తుండటం చరిత్రాత్మకమని తెలిపారు. ప్రధానమంత్రి మోదీకి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లులకు పార్లమెంట్లో ఆమోదం పొందేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు అన్ని పార్టీల ప్రతినిధులు, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీతో పాటు, పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్, 26 రాజకీయ పార్టీలు, ఎంపీలు పాల్గొననున్నారని ఆయన వివరించారు.
ఢిల్లీ వేదికగా బీసీల సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్కుల్కచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్కె.గణేశ్‌చారి, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేశ్, అఖిల భారత విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కవులె జగన్నాథ్, కుర్మ సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్, బీసీ సంఘాల లీడర్లు రావులపోలు నగేశ్ ప్రజాపతి, విక్రమ్ గౌడ్, సింగం నాగేశ్, దుర్గయ్య గౌడ్‌పాల్గొన్నారు.