ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

ఢిల్లీ  చేరుకున్న ప్రధాని మోదీ
  •  ముగిసిన మోదీ పోలెండ్, ఉక్రెయిన్ టూర్

న్యూఢిల్లీ: పోలెండ్, ఉక్రెయిన్‌‌ దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఇండియాకు చేరుకున్నారు. 45 ఏండ్ల తర్వాత భారత ప్రధాని పోలెండ్‌‌లో పర్యటించారు. అలాగే ఉక్రెయిన్‌‌లో పర్యటించిన మొదటి భారత ప్రధానమంత్రి కూడా మోదీయే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్​స్కీతో సమావేశంలో యుద్ధ విరమణ, శాంతియుత పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు, దౌత్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే యూఎన్ చార్టర్‌‌, అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలను సమర్థించే విషయంలో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 2024లో స్విట్జర్లాండ్‌‌లోని బర్గెన్‌‌స్టాక్‌‌లో జరిగిన ఉక్రెయిన్‌‌లో శాంతి సదస్సుకు కూడా ఇండియా హాజరైంది. 

అలాగే తదుపరి శాంతి శిఖరాగ్ర సమావేశంలో భారతీయ నుంచి హైలెవెల్​ కంట్రీబ్యూషన్ ఉంటుందని తెలిపింది. అలాగే ఈ టూర్​లో భారత్, ఉక్రెయిన్ నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పోలాండ్ పర్యటనలో ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఉక్రెయిన్‌‌ యుద్ధం విషాదకర పరిణామాలపై ఇద్దరు నేతలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. అలాగే టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఏ దేశం కూడా టెర్రరిస్టులకు ఆర్థిక సహాయం, మద్దతు ఇవ్వకూడదని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

కీవ్‌‌లో బీఆర్ షీల్డ్ లతో మోదీకి ఎస్పీజీ భద్రత

ప్రధానమంత్రి మోదీ కీవ్‌‌ పర్యటన సందర్భంగా స్పెషల్​ ప్రొటెక్షన్​ గ్రూప్​(ఎస్పీజీ) టీమ్​ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. కీవ్‌‌లోని ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్క్‌‌లోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించేందుకు మోదీ వెళ్లినప్పుడు ఎలాంటి స్నైపర్‌‌ బుల్లెట్ ను అయినా నిలువరించేలా బుల్లెట్ రెసిస్టెంట్(బీఆర్) షీల్డ్‌‌లతో రక్షణ కల్పించారు. మోదీ తన ఇటీవలి రష్యా పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్​ను ఆలింగనం చేసుకోవడంపై ఉక్రెయిన్​లో కొంత నెగెటివ్ సెంటిమెంట్ ఏర్పడినట్టు తెలిసింది. దీంతో ఎస్పీజీ డైరెక్టర్ అలోక్ శర్మ నేతృత్వంలోని 60 మందికి పైగా ఎస్పీజీ కమాండోలు కీవ్​లో మోదీ భద్రతను పర్యవేక్షించారు. పార్క్​లోని మహాత్మా గాంధీ విగ్రహం చుట్టూ మోహరించారు. మోదీ తన ఏడు గంటల కీవ్ పర్యటన ముగిసిన తర్వాత రైలులో పోలాండ్​కు తిరిగి వెళ్లడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.