బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు ఈ రాత్రి నిద్ర పట్టదని సెటైర్లు వేశారు ప్రధాని మోడీ. పాలమూరు ప్రజాగర్జనలో మాట్లాడిన మోడీ..తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కరప్షన్, కమీషన్ ఆ రెండు పార్టీల సిద్ధాంతమన్నారు. రాజకీయ పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని ధ్వజమెత్తారు మోడీ. పార్టీ అధ్యక్ష పదవుల నుంచి అన్ని పదవుల్లో కుటుంబ సభ్యులే ఉంటారని మండిపడ్డారు. కీలక పోస్టులో వారి కుటుంబ సభ్యులను నియమించి.. మిగతా పోస్టుల్లో తమ అవసరాల కోసం ఇతర సభ్యులను నియమిస్తారని విమర్శించారు.
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ మరో పార్టీ చేతిలో ఉందని.. ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసన్నారు మోడీ. తెలంగాణలో మోడీ ఇచ్చే గ్యారంటీలకు తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉందన్నారు. మోడీ హామీ ఇస్తే నెరవేరుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ ఆధరణ పెరుగుతోందన్నారు మోడీ.
తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు మోడీ. తెలంగాణ హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాప్రికా అధ్యక్షుడికి బిద్రి కళాకండాన్ని బహుమతిగా ఇచ్చానన్నారు మోడీ. అప్పటి నుంచి తెలంగాణకు హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ దోపిడి
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో దోపిడి జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల కోసం ఆర్భాటంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని విమర్శించారు. వేల కోట్లతో ప్రాజెక్టులు, సాగునీటి కాల్వలు నిర్మించామని చెప్పుకుంటున్నారని..కానీ ఏ ఒక్క కాల్వల్లో చుక్క నీరు కూడా పారడం లేదన్నారు.
కేసీఆర్ సర్కారు రైతు పథకాల పేరుతో అక్రమంగా సంపాదిస్తోందన్నారు ప్రధాని మోదీ. రైతుల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్..ఆ తర్వాత హామీని నెరవేర్చలేదన్నారు. ఓట్లు దండుకుని రాజకీయంగా లబ్దిపొందారని విమర్శించారు. ఎన్నికల కోసం ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను గౌరవిస్తోందని చెప్పారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రైతులకు ఎంఎస్పీ ధరల ద్వారా ఏటా రూ. 27000 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఇది 8 రెట్లు ఎక్కువ అని వెల్లడించారు. అంతేకాకుండా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా తెలంగాణ రైతులకు రూ. 10 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద పసుపు ఉత్పత్తి దారుగా భారతదేశం ఉందన్నారు. పసుపు ఎగుమతి రెట్టింపు అయ్యిందని...అందుకే పసుపు రైతులకు తగిన ప్రతిఫలం అందివ్వబోతున్నామని చెప్పారు. త్వరలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.