తెలంగాణలో ప్రధాని నరేంద్రమోడీ టూర్ పై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. మోడీ టూర్ ను అబ్జర్వ్ చేస్తే... తెలంగాణలో పాగా వేసేందుకు మోడీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గత పర్యటనలకు భిన్నంగా ఈసారి మోడీ టూర్ కొనసాగింది. ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయని మోడీ.. ఇవాళ హైదరాబాద్ కు రాగానే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉదయం హైదరాబాద్ కు రాగానే బేగంపేటలో నిర్వహిచిన సభలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మోడీ.. రామగుండం సభలో సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ క్లారిటీ ఇచ్చి అధికార, విపక్షాలకు పుల్ స్టాప్ పెట్టారు. అంతేగాకుండా.. సింగరేణిపై హైదరాబాద్ నుంచి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తన పర్యటనతో ఇవాళ కొందరికి నిద్ర కూడా పట్టదంటూ కేసీఆర్ సర్కార్ కు చురకలంటించి సభను ముగించారు.
రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్
ఇవాళ్టి మోడీ టూర్ పూర్తిగా పొలిటికల్ యాంగిల్ తీసుకుందని.. రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ గా టూర్ సాగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో ఎటువంటి రాజకీయ విమర్శలు చేయని మోడీ.. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ గా డైరెక్ట్ అటాక్ చేశారని చెబుతున్నారు. పేదలను దోచుకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నమంటూ హింట్ ఇచ్చారని భావిస్తున్నారు. ఇవాళ్టి మోడీ టూర్ తో తెలంగాణ బీజేపీలో సరికొత్త జోష్ నింపిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
బేగంపేట సభలో..
ఉదయం హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన బీజేపీ స్వాగత సభలో ప్రసంగించిన మోడీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదని పరోక్షంగా టీఆర్ఎస్ సర్కార్ ను హెచ్చరించారు. పేదల ఎదుగుదలకు అవినీతే అడ్డు అని.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నా బీజేపీ కార్యకర్తలు భయపడడం లేదన్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటం కొనసాగుతోందని చెప్పారు. కొందరు తనను తిట్టడం కోసం డిక్షనరీలను వెతుకుతున్నారని ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీ.. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు.
రామగుండం సభలో..
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ.. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు. సింగరేణిపై హైదరాబాద్ నుంచి కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో రాష్ట్ర వాటా 51శాతం, కేంద్రం వాటా 49శాతం ఉందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పారు. తన టూర్ తో హైదరాబాద్ లో ఉండేవాళ్లకు ఇవాళ కొందరికి నిద్ర కూడా పట్టదంటూ మోడీ ప్రసంగం ముగించారు.