మనది దశాబ్దాల స్నేహ సంబంధం: మోదీ
ప్రధాని మోదీకి మయిజ్జు కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: ద్వీప దేశమైన మాల్దీవులకు కష్టమొస్తే ఆదుకునేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఆ దేశంతో భారత్‌ది దశాబ్దాల స్నేహ బంధమని చెప్పారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ మయిజ్జు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం మయిజ్జు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరుదేశాల నేతలు చర్చలు జరిపారు. అంతకుముందు మాల్దీవ్స్ లో రూపే కార్డును, హనిమాధూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రన్ వేను వర్చువల్‌గా ప్రారంభించారు. 400 మిలియన్ డాలర్లు, రూ. 3000 కోట్ల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
మయిజ్జు పర్యటనతో సంబంధాలు బలోపేతం
మయిజ్జు పర్యటనతో ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో సంబంధాలు బలోపేతం కానున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మాల్దీవుల అధ్యక్షుడు, ఆయన ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. భారత్‌కు మాల్దీవ్స్ అతి సమీప, సన్నిహిత దేశమని తెలిపారు.
సరిహద్దు దేశాలతో భారత్ విధానంలోనూ, సాగర్విజన్ లోనూ ఆ దేశానికి కీలక భూమిక ఉన్నదని వెల్లడించారు. ఆ దేశానికి సహాయపడడంలో భారత్ ముందుంటుందని భరోసా ఇచ్చారు. పొరుగు దేశాలపట్ల భారత్ ఎల్లప్పుడూ బాధ్యతగా ఉంటుందని స్పష్టం చేశారు.
కష్టసమయంలో భారత్ సాయం: మయిజ్జు
తాము కష్టాల్లో ఉన్నప్పుడల్లా భారత్ స్నేహహస్తం అందిస్తోందని మయిజ్జు తెలిపారు. రూపే కార్డుతో భారత్–మాల్దీవుల మధ్య పర్యాటక, ఆర్థిక బంధం బలపడుతుందని తెలిపారు. ఇది మాల్దీవ్స్ టూరిజం సెక్టార్‌కు లాభిస్తుందని తెలిపారు. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేసి, మాల్దీవుల ప్రజలను ఆదుకుంటున్నందుకు భారత్‌తోపాటు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.
కాగా, మోదీతో భేటీకి ముందు మయిజ్జుతోపాటు ఆ దేశ ఫస్ట్ లేడీకి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి మయిజ్జు నివాళులర్పించారు.