టెర్రరిస్టులను ఏరిపారేస్తం.. పాక్​కు తగిన బుద్ధి చెప్తం: మోదీ 

టెర్రరిస్టులను ఏరిపారేస్తం.. పాక్​కు తగిన బుద్ధి చెప్తం: మోదీ 
  •     ఆ దేశం చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు
  •     ఉగ్రవాదం ముసుగులో పరోక్ష యుద్ధం చేస్తున్నది
  •     పాక్​ దుర్మార్గపు కుట్రలను తిప్పికొడ్తామని హెచ్చరిక  
  •     కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని నివాళి

ద్రాస్ (కార్గిల్) : పాకిస్తాన్ బుద్ధి ఇంకా మారలేదని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఆ దేశ దుర్మార్గపు కుట్రలను తిప్పికొడతామని, శత్రువుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం లడఖ్ వెళ్లారు. ద్రాస్ లోని యుద్ధ స్మారకం వద్ద కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు.

అక్కడి నుంచి షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ఇటీవల ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో కార్గిల్ వేదికగా పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘పాకిస్తాన్ గతంలో ప్రతిసారీ యుద్ధంలో ఓడిపోయింది. అయినా చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు టెర్రరిజం ముసుగులో పరోక్ష యుద్ధం చేస్తున్నది.

కానీ ఆ దేశ దుర్మార్గపు కుట్రలను మేం తిప్పికొడతాం” అని అన్నారు. ‘‘టెర్రరిస్టులను తయారు చేస్తున్నోళ్లు నేరుగా నా గొంతును వినగలిగే ప్రాంతం నుంచి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. నేను వాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. వాళ్ల దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ విజయవంతం కావు.. కానివ్వం. మా సైనికులు ఉగ్రవాదులను ఏరి పారేస్తారు” అని హెచ్చరించారు. పొరుగు దేశంతో తాము శాంతినే కోరుకుంటున్నామని, కానీ పాక్ మాత్రం తన అసలు రూపం చూపిస్తున్నదని మండిపడ్డారు. 

అభివృద్ధి పథంలో కాశ్మీర్.. 

దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని మోదీ అన్నారు. ‘‘కార్గిల్ యుద్ధంలో విజయం ఏ ఒక్క ప్రభుత్వానిదో, ఏ ఒక్క పార్టీదో కాదు. అది దేశ సైనికులు సాధించిన విజయం” అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. జీ20 సమావేశాల నిర్వహణ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, టూరిజం డెవలప్ మెంట్, సినిమా హాల్స్ ఓపెనింగ్ వంటివే ఇందుకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.  

అగ్నిపథ్ పై ప్రతిపక్షాలది రాజకీయం..

అగ్నిపథ్ స్కీమ్ పై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. ‘‘ఆర్మీలో తెచ్చిన సంస్కరణలకు అగ్నిపథ్ ఒక ఉదాహరణ. ఆర్మీలో యువతరం ఉండేలా, ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చూసుకునే ఉద్దేశంతో ఈ స్కీమ్ తెచ్చాం. కానీ దురదృష్టవశాత్తు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం ఆర్మీ సంస్కరణలపై అబద్ధాలు చెబుతున్నారు. పెన్షన్ డబ్బు ఆదా చేసేందుకు ఈ స్కీం తెచ్చారని ప్రచారం చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. గతంలో దేశ సైనికుల భద్రత గురించి పట్టించుకోని వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

మోదీవే చిల్లర రాజకీయాలు: ఖర్గే 

అగ్నిపథ్ విషయంలో ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. మోదీనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ మోదీ చిల్లర రాజకీయాలు మాట్లాడారు. ఇంతకుముందు ఏ ప్రధాని కూడా ఇలా చేయలేదు. ఆర్మీ సూచన మేరకే అగ్నిపథ్ అమలు చేశామని మోదీ అంటున్నారు. కానీ అది పచ్చి అబద్ధం” అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘యుద్ధాలను ఎదుర్కోవడానికి సైనికులకు ఎంతో శిక్షణ అవసరం. కానీ అగ్నివీర్ లకు ఆ శిక్షణ అందరు. ఇదొక అనాలోచిత పథకం” అని కాంగ్రెస్ లీడర్ కార్తీ చిదంబరం అన్నారు.