ఇండియా, ఖతార్ బంధం బలోపేతం మరిన్ని రంగాల్లో సహకారం: మోదీ

దోహా: ఇండియా, ఖతార్ మధ్య బంధం మరింత బలోపేతమవుతున్నదని ప్రధాని మోదీ తెలిపారు. మరిన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయని చెప్పారు. యూఏఈ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి మోదీ ఖతార్ కు చేరుకున్నారు. గురువారం ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానితో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్, ఎనర్జీ, స్పేస్, కల్చరల్ తదితర రంగాలపై డిస్కస్ చేశారు. 

ఖతార్ రాజు హమద్ తో అద్భుతమైన మీటింగ్ జరిగిందని సోషల్ మీడియా ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. మోదీ, ఖతార్ రాజు మధ్య మీటింగ్ బాగా జరిగిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ‘ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. మాజీ నేవీ ఉద్యోగులను విడిచిపెట్టినందుకు, ఖతార్ లో ఉంటున్న ఇండియన్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నందుకు ఖతార్ రాజు హమద్​కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు” అని పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీ బుధవారం రాత్రి దోహాకు చేరుకోగా అక్కడున్న మనోళ్లుఘన స్వాగతం పలికారు.