ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సున్నా.. ఐదేండ్లు వృధా చేసిన వైసీపీ: మోదీ

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి సున్నా.. అవినీతి మాత్రం వందశాతం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు ఐదేండ్ల సమయాన్ని వృథా చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని చెప్పారు. సోమవారం మోదీ ఆంధ్రప్రదేశ్​లోని రాజమండ్రి, అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ నేతలు ఇప్పటికే ఓటిమిని ఒప్పుకున్నారని, వైసీపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి 

అనేది బీజేపీ మంత్రం అయితే.. అవినీతి అనేది వైసీపీ మంత్రమని ఎద్దేవా చేశారు. ‘మే 13న ఏపీలో మీ ఓటుతో అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏ రికార్డులు సృష్టించబోతోంది. అలాగే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటబోతున్నది. ఇది ఆంధ్రప్రదేశ్​, భారత్​ 
అభివృద్ధిలో మరో ముందడుగు’ అని తెలిపారు.

రాష్ట్ర ఖజానాను వైసీపీ ఖాళీ చేసింది..

మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. మద్యం సిండికేట్​గా తయారైందని మోదీ మండిపడ్డారు. లిక్కర్, సాండ్​ మాఫియాతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. 3 రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారని, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని చెప్పారు. వైసీపీకి అవినీతి  తప్ప.. రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు ఇస్తే.. వైసీపీ సర్కారు ప్రాజెక్టును పూర్తిగా నిలిపేసిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

కాంగ్రెస్​ అంటే స్కామ్​లే

కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని స్కామ్​లేనని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ కుంభకోణాలకు ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఈడీ దాడుల మీద ఇండియా కూటమి గగ్గోలు పెడుతున్నదని, కానీ కాంగ్రెస్ నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయటపడుతోందని చెప్పారు. ఆ డబ్బును మెషీన్లు లెక్కపెట్టలేకపోతున్నాయని అన్నారు. వారి నల్లధనాన్ని తాను పట్టుకుంటే శపిస్తున్నారని, ఆ శాపాలకు తాను భయపడబోనని తెలిపారు. ఏపీలో కూటమి గెలిచి డబుల్ ఇంజిన్​ సర్కారు ఏర్పడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.