న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏ శక్తి ఆర్టికల్ 370ని మళ్లీ తిరిగి తీసుకురాలేదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భారత దేశంలో ఒకే రాజ్యాంగం ఉందని.. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించాలని చూసిందని.. దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండాలన్న కాంగ్రెస్, విపక్షాల కుట్రలను ప్రజలను తిప్పికొట్టారన్నారు. మహారాష్ట్ర పొరుగు రాష్ట్రాలైనా కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. అందుకే కాంగ్రెస్‌కు జనం ఇక్కడ ఓటు వేయలేదని విమర్శించారు.
పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేసిన ప్రజల నమ్మలేదని దుయ్యబట్టారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పరాన్న జీవిగా మారిందని.. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానాతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖాతా అయ్యిందని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ విభజనవాద రాజకీయాలు విఫలం అయ్యాయని అన్నారు. రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి స్థానమే లేదని.. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ వక్ఫ్ చట్టం తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరాఠాల ఆరాధ్య దైవం వీర సావర్కర్‌ను కూడా కాంగ్రెస్ అవమానించిందని ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని.. కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. విభజిత రాజకీయాలు, కుట్రలు, అవినీతికి పాల్పడేవారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహయుతి కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శనివారం (నవంబర్ 23) ప్రధాని మోడీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.