ముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. మహా వికాస్ అఘాడీ అంటే అవినీతి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పడితే.. ఆ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ 'షాహీ పరివార్' ఏటీఎం అవుతోందని విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 9) మహారాష్ట్రలోని అకోలాలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఎ)కి మహారాష్ట్ర అండగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నవంబర్ 9వ తేదీ దేశానికి చారిత్రాత్మకమైనదని.. ఎందుకంటే.. 2019లో ఇదే రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రామమందిరంపై తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలోని అన్ని మతాల ప్రజలు ఎంతో సున్నితత్వాన్ని ప్రదర్శించారని కొనియాడిన మోడీ.. ఇదే భారతదేశం యొక్క గొప్ప బలమని అన్నారు. ప్రధానిగా నా మొదటి రెండు పర్యాయాలు పేదలకు నాలుగు కోట్ల పక్కా ఇళ్లు ఇచ్చామని తెలిపారు.
మహారాష్ట్రలో ఇప్పటికీ తాత్కాలిక ఇల్లు లేదా గుడిసెలో నివసిస్తున్న కుటుంబం కనిపిస్తే వాళ్ల వివరాలు నాకు పంపించడని.. వారికి శాశ్వత ఇల్లు నిర్మిస్తామని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిని ఆశీర్వదించాలని మహారాష్ట్ర ఓటర్లకు ఈ సందర్భంగా ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. కాగా, 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో 2024, నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. 2024, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.